విదేశీ విద్య రూటు మారుతోంది! | Australia tops the list of top overseas education destinations | Sakshi
Sakshi News home page

విదేశీ విద్య రూటు మారుతోంది!

May 3 2025 5:15 AM | Updated on May 3 2025 1:27 PM

Australia tops the list of top overseas education destinations

అధిక జీతాలు, కెరీర్‌ పురోగతికే భారతీయ విద్యార్థుల పెద్దపీట 

ఉన్నత విద్య చదివినా దేశంలోనే ఉద్యోగంలో స్థిరపడేందుకు ప్రణాళిక 

భారతీయుల ప్రాధాన్య గమ్యస్థానంలో వెనుకపడ్డ అమెరికా 

విదేశీ విద్య గమ్యస్థానాల ఎంపికలో ఆస్ట్రేలియాకు అగ్రస్థానం 

ఆ తర్వాత యూకేకు ఓటు 

సాక్షి, అమరావతి: విదేశీ విద్యను ఎంపిక చేసుకోవడంలో భారతీయ విద్యార్థుల రూటు మారుతోంది. కెరీర్‌ పురోగతి ఉన్న దేశాల యూనివర్సిటీల్లోనే చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు మెరుపర్చుకోవడం, అధిక ఆదాయాన్ని ఆర్జించడం వంటి ప్రాథమిక లక్ష్యాలను బేరీజు వేసుకుని విదేశాల్లో విద్యపై నిర్ణయం తీసుకుంటున్నారు. భారతీయ విద్యార్థులు కేరీర్‌ కేంద్రీకృత విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఇటీవల అంతర్జాతీయ కన్సల్టెన్సీ ‘ఐడీపీ ఎడ్యుకేషన్‌’ చేసిన అధ్యయనంలో తేలింది.  

విద్య కోసం విదేశీ గమ్యస్థానాలను ఎంచుకోవడంలో విద్యార్థుల ప్రాధాన్యతలు ఇలా (శాతం).. 
కెరీర్‌ పురోగతి 77 
ఉద్యోగ నియామకాలు 70 
వర్సిటీల ద్వారా కొలువులు 69 
స్కాలర్‌షిప్‌ల లభ్యత 55
పార్ట్‌టైమ్‌ ఉద్యోగ అవకాశాలు 54
పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ తర్వాత అక్కడే ఉద్యోగం (ప్రస్తుతం చదువుతున్నవారు) 45
పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన చోటే ఉద్యోగం (చదువుకు ప్రణాళిక వేస్తున్నవారు) 43

ఉద్యోగాలు వచ్చే వర్సిటీల్లోనే చదువు..
» 70 శాతం మంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్య గమ్యస్థానాన్ని ఎంచుకోనే సమయంలో ఉద్యోగ నియామకాలను కీలకమైన అంశంగా పరిగణిస్తున్నట్టు ‘ఐడీపీ ఎడ్యుకేషన్‌’ వెల్లడించింది. 

»    కెరీర్‌ అవకాశాలు పెంచుకోవడానికి అటువంటి అవకాశాలు కల్పించే సంస్థలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా విదేశీ సంస్థలు ప్రతిభ గల భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి వివిధ ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. 

»  విశ్వవిద్యాలయాల ఎంపికలోనూ విద్యేతర అంశాలకు భారతీయ విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. చదువు ముగిసిన తర్వాత ఎంత మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారనే లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఇలాంటి దృక్పథంలో ప్రపంచ సగటు (60శాతం) కంటే భారత్‌లో తొమ్మిది శాతం (69%) ఎక్కువగా ఉంది. 

»   గతంలో భారతీయుల ఇష్టమైన విదేశీ విద్య గమ్యస్థానంగా ఉన్న అమెరికాను అధిగమించి ఆ్రస్టేలియా అత్యంత ఆదరణ పొందిన ఎంపికగా నిలిచింది. ఆస్ట్రేలియాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతోపాటు చదువు పూర్తయిన తర్వాత పని హక్కు కల్పించడం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత యూకే రెండో స్థానంలో నిలిచింది.  

Advertisement
 
Advertisement
Advertisement