నారాసుర రక్త చరిత్ర | Attacks and acts of violence against YSRCP candidates driven by the fear of defeat in local elections | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ నారాసుర రక్త చరిత్ర

Oct 17 2026 5:50 AM | Updated on Oct 17 2026 5:50 AM

Attacks and acts of violence against YSRCP candidates driven by the fear of defeat in local elections

రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ 

పచ్చమూకల రాక్షస క్రీడతో నామినేషన్ల తొలిరోజునే రక్తసిక్తం

స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు 

పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం 

పక్కా పథకం ప్రకారం రాళ్లు, రాడ్లు, కర్రలతో మాటు వేసి మరీ దాడి

పోలీసులు ఉన్నారనే ఉనికి కోసం చివరి క్షణంలో గాల్లోకి కాల్పులు

రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి.. వాహనాలకు నిప్పు 

ధర్మవరంలో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడి 

నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేసిన కూటమి నాయకులు 

దాడుల్లో 22 మందికి గాయాలు, వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలు 

కడపలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు లాక్కొని చించేసిన వైనం 

తాడిపత్రిలో అభ్యర్థిని హత్య చేస్తామంటూ బెదిరింపులు 

ఆళ్లగడ్డలో నామినేషన్‌ పత్రాలు చింపి ముఖంపై విసిరేసిన రౌడీలు 

గుత్తిలో వైఎస్సార్‌సీపీ నేత సోదరుడు జలాని కిడ్నాప్‌  

నామినేషన్‌ వేయకుండా పిడుగురాళ్ల మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు  

దాచేపల్లిలో అభ్యర్థి నిర్బంధం.. హెచ్చరికలు.. తిరుపతిలో ఎక్కడికక్కడ బరితెగింపు.. దాఖలు చేసిన నామినేషన్లను తీసుకెళ్లిన వైనం 

టీడీపీ గూండాల దౌర్జన్యాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి కెమెరామెన్, రిపోర్టర్‌పై దాడి  

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రాళ్లు, రాడ్లు, కర్రలతో రెచ్చిపోయిన రౌడీ మూకలు   

ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డగోలుగా బాబు అండ్‌ కో బరితెగింపు 

కళ్లెదుటే దాడులు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు  

సాక్షి, అమరావతి : జంగిల్‌ రాజ్‌ పాలనలో స్థానిక ఎన్నికల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. చంద్రబాబు, లోకేశ్‌ డైరెక్షన్‌లో పేట్రేగిపోయిన పచ్చమూకల రాక్షస క్రీడకు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ తొలి రోజునే రాష్ట్రం రక్తసిక్తమైంది. ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి వైఎస్సార్‌సీపీ కీలక నేతలను టార్గెట్‌ చేసి.. అడ్డుతొలగించే కుట్రలకు పాలక పార్టీ పెద్దలు పథక రచన చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళికలు రచించి.. రాళ్లు, ఇనుప రాడ్లు, కర్రలు, పెట్రోల్‌ బాటిల్స్, కారంతో పచ్చ మూక భౌతిక దాడులకు దిగి బీభత్సం సృష్టించింది. 

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కాన్వాయ్‌లోని కార్లను ధ్వంసం చేసి ఆయనపై దాడి చేయడం, రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని, అక్కడే ఉన్న కార్లకు నిప్పంటించి తగలబెట్టడం జంగిల్‌రాజ్‌ పాలనలో పేట్రేగిన రౌడీయిజానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఇప్పటికే బైండోవర్‌ కేసుల పేరుతో పోటీ నుంచి తప్పించేందుకు పోలీసులు బెదిరింపులకు దిగినా.. ఎన్‌ఓసీ, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెట్టినా.. లెక్క చేయక వైఎస్సార్‌సీపీ శ్రేణులు నామినేషన్‌ వేసేందుకు తరలి రావడంతో ఖంగుతిన్న పచ్చ మూక ఎక్కడికక్కడ రెచ్చిపోయి విధ్వంసం సృష్టించింది.   

హామీలు నెరవేర్చలేకే దాడులు 
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దగా చేసిన చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే ధైర్యం లేక అటు పోలీసులను, ఇటు పార్టీ గూండాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపైకి ఉసిగొల్పారు. ఎన్నికలు సజావుగా జరిగితే ఓటమి ఖాయమనే భయంతో అధికారపక్షం నేతలు ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ లేకుండా చేసేందుకు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు దిగారు. ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు అడగాల్సిన అధికార పార్టీ శ్రేణులు.. ప్రత్యర్థి అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రాలకు చేరకుండా అడ్డుకున్నారు. 

పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటిలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిలపై టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో హత్యాయత్నం చేశారు. ధర్మవరంలో రాళ్ల దాడి చేసి పలువురు వైఎస్సార్‌సీపీ శ్రేణులను గాయాలపాల్జేశారు. టీడీపీ మూకలు నామినేషన్లను లాక్కెళ్లి చించేశారు. తిరుపతిలో మహిళా అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను, నంద్యాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను లాక్కొని టీడీపీ రౌడీలు చింపివేశారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నామినేషన్‌ వేయడానికి వీలులేదని బెదిరించారు. దాచేపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నిర్బంధించారు. 

పోలీసులు కళ్ల ఎదుటే రాష్ట్ర వ్యాప్తంగా పచ్చ రౌడీలు భౌతిక దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓటమి భయంతో అధికార పక్షం అడ్డగోలుగా బరితెగించి భౌతిక దాడులకు దిగినా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శల పాలైంది. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవలేని అధికార పక్షం.. ప్రత్యర్థులు పోటీలోనే లేకుండా చేయాలనుకుంటోందని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఆరోపించింది. అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, నామినేషన్‌ పత్రాల ధ్వంసం, పోలీసుల తీరుపై ఫిర్యాదులు రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణపై ఆందోళన కలిగిస్తున్నాయి.

ఆళ్లగడ్డలో అరాచకం 
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్‌ కార్యాలయంలోని నామినేషన్‌ కేంద్రంలో నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు రావడంతో టీడీపీ నాయకులు.. ఎమ్మెల్యే అఖిలప్రియ తమ్ముడు విఖ్యాత్‌రెడ్డిని అక్కడకు పిలిపించుకున్నారు. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసే వరకు అక్కడే తన అనుచరులను వెంటబెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. ఆళ్లగడ్డ 12వ వార్డు కౌన్సిలర్‌ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు మౌదీన తన భర్త మౌలాలితో కలిసి వచ్చారు. ఆర్‌ఓ దగ్గరకు వెళ్లగా టీడీపీ నేతల ఒత్తిడితో డబ్బులు (ధరావత్తు) రాసుకునే రిసిప్ట్‌లు తన దగ్గర లేవని.. బయట చెల్లించి రావాలని పంపించారు.బయట ఉన్న టీడీపీ నేతలు ఆమె దగ్గరకు వచ్చి నామినేషన్‌ వేయకుండా వెళ్లాలని బెదిరించారు.

అయితే ఆమె భయపడక పోవడంతో పచ్చమూకలు చుట్టుముట్టి నోటికొచ్చినట్లు తిడుతూ దౌర్జన్యంగా ఆమె చేతుల్లోని నామినేషన్‌ పత్రాలను చించి ఆమె మొఖంపై విసిరేశారు. ఇదాంతా రిటర్నింగ్‌ అధికారులు, పోలీసు బలగాలు చూసినా పట్టించుకోకుండా వెకిలి నవ్వులు నవ్వారు. 18వ వార్డుకు వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్‌ వేసేందుకు వచ్చిన అల్లాబక్షును కూడా రిటర్నింగ్‌ కార్యాలయంలో టీడీపీ నాయకులు బెదిరించారు. ఒకానొక దశలో ఆయన్ను గదిలోకి ఈడ్చుకెళ్లి చెయ్యి చేసుకునేందుకు యత్నించారు. దీంతో ఆయన నామినేషన్‌ దాఖలు చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిలు ఆర్‌ఓ కార్యాలయానికి చేరుకున్నారు. దీనిపై పోలీసులను, ఎన్నికల అధికారులను గట్టిగా నిలదీయగా వారు నీళ్లు నమిలారు.    

గుత్తిలో రెచ్చిపోయిన పచ్చ మూకలు 
అనంతపురం జిల్లా గుత్తి మునిసిపాలిటీలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ తరఫున 22వ వార్డు (జంగాల కాలనీ) కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమైన దస్తగిరి ఇంటికి సుమారు 16 మంది టీడీపీ కార్యకర్తలు కత్తులతో వెళ్లి నామినేషన్‌ వేస్తే చంపేస్తామని బెదిరించారు. ఆ సమయంలో దస్తగిరి అక్కడ లేకపోవడంతో సోదరుడు జిలాన్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులుగా పోటీ చేయనున్న అరవింద్, రమేష్, సులేమాన్, ఖాజా ఖాన్‌ తదితరులకు ఫోన్‌ చేసి, కొందరిని వ్యక్తిగతంగా కలిసి బెదిరించారు. గుత్తి మున్సిపల్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయులు దాడికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నరహరిపై టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు రాళ్ల దాడి చేశారు. టీడీపీ మూక దాడులను నిలువరించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు.   

కడపలో నామినేషన్‌ పత్రాలు చింపివేత 
దమ్ము, ధైర్యముంటే నామినేషన్‌ వేయమనండి.. అంటూ టీడీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఆర్‌.శ్రీనివాసులురెడ్డి బహిరంగంగానే వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. కడప నగరంలోని స్థానిక గాంధీ నగర్‌ హైస్కూల్‌ నామినేషన్‌ కేంద్రం వద్దకు వచ్చిన ఆయన దమ్ము, ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్ధులను నామినేషన్‌ వేయమనండి చూద్దాం అని బెదిరించే ధోరణిలో వ్యాఖ్యానించారు. 

పోలీసులు, మీడియా, అధికారులు ఉన్నారు కదా నామినేషన్‌ వేయమనండి ఏదైనా ఉంటే అందరూ చూస్తారు అని బెదిరించారు. దీంతో రెచ్చిపోయిన పచ్చమూక అరాచకానికి పాల్పడ్డారు. 30వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయలక్ష్మిని నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు. రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌ఓ)కి ఇచ్చిన నామినేషన్‌ పత్రాలు లాక్కుని టీడీపీ గూండాలు చించేశారు. 51 డివిజన్‌లో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన స్వర్ణలతను అడ్డుకున్నారు. ఆమె సోదరుడు, మాజీ కార్పొరేటర్‌ బాలస్వామిరెడ్డిపై కూడా పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు  దాడి చేశారు.   

పల్నాడులో పచ్చ నేతల అరాచక పర్వం 
పల్నాడు జిల్లాలో పచ్చ నేతల అరాచకపర్వానికి అంతు లేకుండా పోయింది. నామినేషన్‌లు వేసేందుకు ఎవరు వస్తారో చూస్తామంటూ.. మున్సిపల్‌ కార్యాలయాల వద్ద టీడీపీ మూకలు హల్‌చల్‌ చేశాయి. గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియను అడ్డుకునేందుకు టీడీపీ అల్లరి మూకలు వివిధ గ్రామాల నుంచి పట్టణాలకు చేరుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలే టార్గెట్‌గా దౌర్జన్యాలకు దిగారు. శుక్రవారం ఉదయం నుంచే నామినేషన్‌ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ అరాచక శక్తులు ఎవ్వరినీ రానీయకుండా కర్రలు, రాడ్‌లతో స్వైర విహారం చేశాయి. 

కొందరు పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నట్టు లా అండ్‌ ఆర్డర్‌ను గాలికొదిలేసి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతూ పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలా వ్యవహరించారు. ముఖ్యంగా పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పట్టణంలో శుక్రవారం నామినేషన్‌ల సందర్భంగా టీడీపీ మూకలు నామినేషన్‌ కేంద్రాలను ఆక్రమించి అరాచకం సృష్టిస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, వారికి కాపు కాస్తున్న పరిస్థితి కనిపించింది. పోలీసులు వేసుకున్న టెంట్‌లలోనే అధికార పార్టీ నేతలు కూర్చుని నామినేషన్‌లు వేసేందుకు ఎవరూ రాకుండా పిడుగురాళ్ల మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు వేశారు. నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ కోసం వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ అభ్యర్థి అక్కడకు వెళ్లగా, టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆర్య వైశ్య నాయకుడు భవనాసి ఎల్లారావును పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి బైండోవర్‌ చేసి తహసీల్దారు ముందు హాజరు పరిచారు.    

దాచేపల్లిలో అభ్యర్థి నిర్బంధం  
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లారని, ఆయన ఎక్కడున్నారనే సమాచారం కుటుంబ సభ్యులకు అందలేదని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. తమ నివాసంలో మద్యం పెట్టి తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆయన తండ్రి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలంతా దాచేపల్లి పోలీసు స్టేషన్‌కు చేరుకుని, ఆందోళన వ్యక్తం చేశారు. 

శుక్రవారం రాత్రి ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కాగా, గురజాల నగర పంచాయతీ పరిధిలో నడిబొడ్డున ఉన్న మున్సిపల్‌ కార్యాలయాన్ని వదిలేసి, కమ్మగడ్డలోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో నామినేషన్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్లు వేయడానికి ఎవరు వస్తారో చూస్తామంటూ ఇతర గ్రామాల నుంచి మోహరించిన టీడీపీ గూండాలు కర్రలు, రాడ్‌లతో హల్‌చల్‌ చేశారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు.  

హత్య చేస్తామంటూ తాడిపత్రిలో బెదిరింపులు 
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి అతని భార్యను పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు బెదిరించారు. ఈ ఘటనకుసంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యిందని, జేసీ అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. వేణుగోపాల్‌రెడ్డి కుటుంబానికి రక్షణ కల్పించాలని, బెదిరింపులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు.  

తిరుపతిలో పచ్చమూకల బరితెగింపు
» తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయటానికి వీల్లేకుండా పచ్చమూకలు దాడులకు తెగబడ్డారు. నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారు. తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్‌ జేబీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, బయట నుంచి తెచ్చుకున్న రౌడీ మూకలను వార్డు సచివాలయాల వద్ద మోహరింపజేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయటానికి వీలే లేకుండా చేశారు. నామినేషన్లు వేసినా.. అభ్యర్థుల ఇంటికి వెళ్లి వారిని కొట్టి.. వార్డు సచివాలయానికి తీసుకొచ్చి ఆర్‌ఓ నుంచి పత్రాలు ఇప్పించి అధికారుల ఎదుటే చించివేశారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం అపహస్యం చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

»  నగరంలోని కొర్లగుంట పరిధిలోని 55వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్ష్మమ్మ నామినేషన్‌ వేసేందుకు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో టీడీపీ మూకలు ఆమెను అడ్డుకున్నాయి. ఆమెకు మద్దతుగా వచ్చిన వైఎస్సార్‌సీపీ అనుచరులతోపాటు అభ్యర్థిని బయటకు లాగివేసి దాడికి తెగబడ్డారు. ఆపై నామినేషన్‌ పత్రాన్ని లాక్కుని చించివేశారు. విషయం తెలుసుకుని కొర్లగుంట ప్రాంతానికి వెళ్లిన ఎంపీ గురుమూర్తి, వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల రీజనల్‌ కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డిపైనా పచ్చమూకలు దాడి చేసేందుకు యత్నించారు.  

»  తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలోని రామానాయుడు ప్రభుత్వ పాఠశాలలోని కేంద్రంలో తన వాళ్లకు మద్దతుగా నామినేషన్లు వేయించేందుకు వెళ్లిన తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన అభినయరెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. అభ్యర్థి జుట్టుపట్టుకొనిలాక్కొచ్చి చేతిలో ఉన్న నామినేషన్‌ పత్రాలను చించివేసి అరాచకం సృష్టించారు. జీవకోన, ఎంఆర్‌పల్లి, ఎస్టీవీ నగర్‌లోనూ ఇదే తరహాలో టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. నామినేషన్‌ పత్రాలను చించివేశారు. నగరంలోని చెన్నారెడ్డి కాలనీ పరిధిలోని 31, 32, 33వ డివిజన్‌ గంజాయి బ్యాచ్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుని నామినేషన్‌ వేయకుండా వీరంగం సృష్టించింది. 

»  తిరుపతి నగరంలోని 15వ డివిజన్‌లో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఈశ్వరమ్మను టీడీపీ గూండాలు నిలువరించారు. పోలీసుల ఎదుటే వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేశారు. అయినా పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. ఎట్టకేలకు ఈశ్వరమ్మ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ వేసినట్లు అధికారులు అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్పును కూడా ఆమెకు అందజేశారు. ఆ తర్వాత టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్‌ ఆర్‌ఓ వద్ద ఉన్న ఈశ్వరమ్మ నామినేషన్‌ ఫైలును తీసుకెళ్లిపోయాడు.   

»  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అనిల్, నల్లాని బాబు.. వార్డు సచివాలయాలకు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ గూండాలు వారి నివాసానికి వెళ్లి దౌర్జన్యానికి దిగారు. అనంతరం ఆ వార్డు సచివాలయానికి బలవంతంగా తీసుకెళ్లి ఆర్వో నుంచి నామినేషన్‌ పత్రాలు తీయించుకుని వాటిని చించివేసి తగులబెట్టారని అనిల్, నల్లాని బాబు ఆందోళన వ్యక్తం చేశారు.  

»  తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యాలు, దాడులను చిత్రీకరిస్తున్న సాక్షి మీడియా కెమెరామెన్లు ముఖేష్, మోహన్‌ నాయుడు, రిపోర్టర్‌ ప్రసాద్‌పై దాడి చేశారు. వారి వద్ద ఉన్న విలువైన కెమెరా, మొబైల్‌ ఫోన్లు లాక్కుని అరాచకం సృష్టించారు.

ధర్మవరంలో రాళ్ల దాడి.. నామినేషన్‌ పత్రాలు చింపివేత  
సత్యసాయి జిల్లా ధర్మవరంలో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై పచ్చ మూక పెద్ద ఎత్తున రాళ్ల దాడికి పాల్పడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిపై టీడీపీ గూండాలు దాడి చేసి వారి నామినేషన్‌ పత్రాలు లాక్కెళ్లారు. కౌన్సిలర్‌ అభ్యర్థులు మేడాపురం వెంకటేశ్, బాలంగోపాల్, సుబ్బరాయుడు, ఎర్రగుంట భాగ్యలక్ష్మి తదితరుల నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కుని చించి వేశారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అనుచరుడు హరీష్‌ బాబుతో పాటు పలువురు నామినేషన్‌ కేంద్రం వద్దకు వచ్చి వైఎస్సార్‌సీపీ మద్దతు దారులపై ఇష్టారాజ్యంగా రాళ్లతో దాడి చేశారు.

ఈ దాడిలో 22 మంది గాయపడ్డారు. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో అప్రాశ్చెర్వు ఈశ్వరయ్య, ఆదినారాయణ, బగ్గిరి బయపరెడ్డి, సుబ్బరాయుడు, గుండా ఈశ్వరయ్య ఉన్నారు. గాయపడిన వారిని వీల్‌ఛైర్లలో కూర్చోబెట్టి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిరసన ప్రదర్శన నిర్వహించారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం, దాడులకు దిగడం ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement