రాష్ట్ర ఎన్నికల సంఘానికి, పోలీసులకు హైకోర్టు ఆదేశం
వైఎస్సార్సీపీ పిటిషన్పై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నామినేషన్ కేంద్రాల లోపల, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు శుక్రవారం ఎన్నికల సంఘాన్ని, పోలీసులను ఆదేశించింది. స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా నామినేషన్ కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా స్పష్టంచేసింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని తేల్చి చెప్పింది.
అలాగే డీజీపీ తాజాగా జారీ చేసిన సర్క్యులర్ను అనుసరించాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఎన్నికల అధికారులందరూ తమ గుర్తింపు కార్డులు స్పష్టంగా కనిపించేలా ధరించేలా ఆదేశిస్తూ ఓ సర్క్యులర్ జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల పరిశీలకులను గానీ లేదా ఏ ఇతర అధికారిని గానీ ఎవరైనా గుర్తింపు కార్డులు కోరితే, , తక్షణమే చూపించేలా ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
పారా మిలటరీ దళాల కోసం వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం..
స్థానిక ఎన్నికల వేళ అధికార పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా పారా మిలటరీ దళాలను ఏర్పాటు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. అధికారపార్టీ దౌర్జన్యాలతోపాటు సాక్షాత్తు ఓ మంత్రి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని చంపేస్తామంటూ బెదిరించిన విషయాన్ని కోర్టుకు నివేదించారు.
అలాగే రాయచోటిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని తగలబెట్టడం, పుంగనూరులో ఏకంగా పార్లమెంట్ సభ్యుడిపై హత్యాయత్నం చేసిన ఘటనలనూ కోర్టుకు నివేదించారు. ఎంపీపైనే దాడి చేసి, తిరిగి ఆయనపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారని వివరించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని వివరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు కనిపిస్తే వేసేయండిరా అంటూ పోలీసులే అధికార పార్టీ వారిని ఉసిగొల్పుతున్నారని కోర్టుకు నివేదించారు.
నామినేషన్ వేసేందుకు అభ్యర్థులెవరూ బతికి ఉండే పరిస్థితే లేదు...
ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ, జనాలపైకి ప్రతిపక్ష ఎంపీ కారు దూసుకెళ్లిందని, ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిందని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తే, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, అప్పటికి ఎన్నికలు ముగిసిపోతాయని, నామినేషన్ వేసేందుకు అభ్యర్థులెవరూ బతికి ఉండే పరిస్థితీ లేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
పారా మిటలరీ దళాలను రప్పించడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా నామినేషన్ కేంద్రాల లోపల, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని, పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


