అన్నమయ్య జిల్లా కురబలకోటలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై పోలీసులు ఉండగానే దాడికి తెగబడుతున్న టీడీపీ గూండాలు
వెన్నుపోటు పార్టీతో పోలీస్ కుమ్మక్కు కుతంత్రం
సుప్రీంకోర్టు ఆదేశించినా ఎస్‌ఈసీ చోద్యం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల చివరి రోజూ దురాగతం
పోలీసుల సమక్షంలోనే పచ్చ మూకల దౌర్జన్యం
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అడ్డంకులు.. దాడులు, పత్రాల చించివేత, నాయకుల గృహ నిర్బంధాలు
ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పోరాటం
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన టీడీపీ మూకల దౌర్జన్యకాండ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వెన్నుపోటు ప్రభుత్వం, పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే పౌరుల హక్కుపై నారాసురుడు గొడ్డలివేటు వేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, రాష్ట్రంలో సాగుతున్న రాక్షసకాండను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏమాత్రం అడ్డుకోలేకపోతోంది. మరో మాటలో చెప్పాలంటే ఊరూరా దౌర్జన్యాలు, దాడులు, హత్యాయత్నాలు, నేతల గృహ నిర్బంధాలు యథేచ్ఛగా సాగుతున్నా చోద్యం చూస్తోంది. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లకు ఆఖరి రోజైన శుక్రవారం ఎంపీటీసీ, జడ్‌పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి.
పచ్చ మూకలు నామినేషన్ పత్రాలను లాక్కొని చించి వేయడంతో పాటు అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి. రెడ్‌బుక్‌కు జీ హుజూర్ అంటున్న పోలీసులు రౌడీలను వదిలేసి.. బాధిత వైఎస్సార్‌సీపీ నాయకులపైనే లాఠీలు ఝళిపిస్తున్నారు. వీరిపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఫలితంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులను అడ్డుకోవడం నుంచి మహిళా అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వరకు వెన్నుపోటు పార్టీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయి.

మార్కాపురం జిల్లా వాగుమడుగు ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిరుపతమ్మ నామినేషన్ పత్రాలు చించడంతో పాటు జాకెట్ లాగటంతో అవమానంతో బయటకు వస్తున్న దృశ్యం
భద్రత మధ్య నామినేషన్ వేయిస్తామని చెప్పి.. సమయం మించిపోతున్న తరుణంలో పోలీసులు చేతులెత్తేసి మోసం చేశారు. నామినేషన్ వేస్తే చంపుతామని పలుచోట్ల టీడీపీ గూండాలు బాహాటంగా బెదిరింపులకు దిగినా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోవడం శోచనీయం. స్థానిక ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కోలేని అధికారపక్షం నామినేషన్ల దశలోనే అడ్డంకులు సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వైఎస్సార్‌సీపీ నేత కుటుంబంపై విచక్షణారహితంగా దాడి
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండులో వైఎస్సార్‌సీపీ నేత శ్రీరామరెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో ఆయన కాలు, చేయి విరిగింది. మల్లెపల్లె ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేస్తారేమోనని ఆయన భార్య, పిల్లలను సైతం ఈడ్చి పడేసి దాడి చేశారు. అడ్డుకోబోయిన మరో ముగ్గురిపై కూడా దాడి చేశారు. శ్రీరామరెడ్డి అపస్మారక స్థితికి వెళ్లడంతో చనిపోయాడని భావించి వెళ్లిపోయారు.
ఆదోని, దిబ్బనకల్ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు చించివేశారు.ఏరూరు ఎంపీటీసీ అభ్యర్థి తిమ్మాపురం సేనాపతిని నామినేషన్ కేంద్రానికి వెళ్లవద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని గృహ నిర్బంధం చేశారు. హొళగుందలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు కుల, ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేస్తున్న మీ సేవా కేంద్రాన్ని మూసివేయాలని ఎస్‌ఐ దిలీప్‌కుమార్ నిర్వాహకులను బెదిరించారు. కృష్ణగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడి 20 మందిని గాయపరిచారు.
ఉమ్మడి కడప జిల్లాలో యథేచ్ఛగా దాడులు
ఉమ్మడి కడప జిల్లాలో పోలీస్ నిర్బంధం కొనసాగింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసును ఆయన ఇంటికి అంటించారు. రాజంపేటలోని మిట్టమీదపల్లె ఎంపీటీసీ అభ్యర్థి గొంటు మణి నామినేషన్ పత్రాలను టీడీపీకి చెందిన మేకా నరసింహులు చించివేశారు. బద్వేల్‌లోని పోరుమామిళ్ల నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు. సుండుపల్లి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న మహిళా అభ్యర్థుల నుంచి టీడీపీ నాయకుడు మహేష్ నాయుడు దౌర్జన్యం చేసి లాక్కున్నారు. బి.కోడూరు మండలానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేత దేవసాని ఆదిత్యరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
చక్రాయపేటలోని కల్లూరుపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఈశ్వర్‌నాయుడిపై పచ్చ రౌడీలు ఇనుప రాడ్లతో దాడి చేశారు. టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి అండ్‌కో దౌర్జన్యం కొనసాగింది. చాపాడులో మహిళలపై దాడులు చేశారు. కలశపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బేబిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. మైలవరం మండలం వద్దిరాల ఎంపీటీసీ అభ్యర్థి మహాలక్ష్మి కారును ధ్వంసం చేశారు. వీరబల్లె మండలంలో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన లక్ష్మిదేవి, ఆమె కుమారుడుపై పచ్చమూకలు దాడులకు తెగబడ్డారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
గాలివీడులోని గోరాన్‌చెరువు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి వెళ్లిన ఓబులమ్మతోపాటు ఆమెకు మద్దతుగా వచ్చిన మహిళలపై పచ్చ రౌడీలు దాడి చేశారు. పుంగనూరు నియోజకవర్గం సోమలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వాహనాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. రాయచోటి నియోజకవర్గం గోరాన్ చెరువు, అరవీడు, దేవపట్ల నుంచి నామినేషన్లు వేయడానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకొని దాడి చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెదిరింపులు
చిత్తూరు జిల్లా కుప్పం, శాంతిపురం, రామకుప్పం ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులపై పచ్చ మూకలు భౌతిక దాడులకు పాల్పడ్డాయి. నామినేషన్లు వేస్తే చంపేస్తామని బెదిరించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎంఆర్‌పల్లి సమీపంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుడు చెంగల్‌రెడ్డిపై పచ్చ మూకలు దాడి చేశాయి. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంటలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. భవానీ దీక్షలో ఉన్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డిపై టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ బోర్డు సభ్యుడు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ దురుసుగా ప్రవర్తించారు.
రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో ఓబులవారిపల్లి, పెనగలూరు మండల పరిధిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వెయ్యనివ్వకుండా టీడీపీ మూకలు అడ్డుకుని అరాచకం సృష్టించారు. పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో టీడీపీ రౌడీల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో శుక్రవారం 16 స్థానాలకు 16 మంది టీడీపీ వారు.. వైఎస్సార్‌సీపీ నేతల పేరుతో నామినేషన్లు వేశారు.

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు
అనంతపురంలో కొనసాగిన దాష్టీకాలు
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దౌర్జన్యాలు, దాడులు కొనసాగాయి. రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు పేట్రేగిపోయాయి. పెద్దవడగూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లిలో పచ్చ మూకలు అడ్డంకులు సృష్టించారు. నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు యల్లనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టగా పోలీసులు లాఠీచార్జి చేశారు.
నామినేషన్ వేశారని మారణాయుధాలతో దాడి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం ఏనుగులబావి పంచాయతీ కోళ్లదిన్నె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ వర్గీయులు తమ ఎంపీటీసీ అభ్యర్థినిగా సుభాషిణితో నామినేషన్ దాఖలు చేయించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు అట్ల శివరాజారెడ్డి, పులి బాలకోటయ్యలు కావలి నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు తుమ్మలపెంట సెంటర్లలో ఆటో కోసం వేచి ఉండగా.. వంటేరు ప్రసన్న, పెనుగొండయ్య, ఫణీంద్ర, మహేంద్ర, గొల్లపల్లి సుధీర్, నందకిషోర్, వినోద్, మహేంద్ర, తదితరులు ఒక్కసారిగా మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు.
అంతటా అదే దౌర్జన్యం
మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ దౌర్జన్యం కొనసాగింది. కొమరోలులో టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. 16 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. తర్లుపాడు మండలంలో టీడీపీ గూండాలు ఎంపీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా వేయనివ్వలేదు. పీసీపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులమంటూ 9 దొంగ నామినేషన్లు దాఖలయ్యాయి. బేస్తవారిపేట నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. గిద్దలూరు మండలం జయరాంపురం, కనిగిరి, సీఎస్‌పురం, ప్రకాశం జిల్లా కందుకూరులో దాడులు కొనసాగాయి.
దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆవుల మోహన్‌రెడ్డిని టీడీపీ రౌడీలు కొట్టి గాయపరిచారు. కందుకూరు, యర్రగొండపాలెం నియోజకవర్గంలో దాడులు కొనసాగాయి. పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి నామినేషన్ వేసేందుకు వెళ్లిన జనసేన నాయకుడు పగడాల శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరింపజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొటికలపూడి ఎంపీటీసీ అభ్యర్థి పాలడుగు జ్యోత్స్న నామినేషన్ ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ ఎంపీటీసీ అభ్యర్థి తోట ఆదిలక్ష్మిని టీడీపీ నేతలు తీవ్రంగా బెదిరించారు.

తిరుపతి జిల్లా తొట్టంబేడులో టీడీపీ నాయకులు చించివేసిన పెద్ద కన్నలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసుల నిర్బంధకాండ
పల్నాడు జిల్లా మాచర్లలో పోలీస్ నిర్బంధకాండ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మూడు రోజులుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై పోలీసుల సమక్షంలోనే పచ్చ మూకలు పేట్రేగిపోయి దాడులు చేశాయి. మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల, కారంపూడి, దుర్గి నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు అడ్డంకులు సృష్టించారు. మాచర్ల జెడ్పీటీసీ అభ్యర్థి పెద్దరాజు అన్న కుమారుడు శివలీల కృష్ణ యాదవ్‌ను నామినేషన్ కేంద్రం నుంచి కిడ్నాప్ చేశారు. ఇద్దరు మీడియా ప్రతినిధులపై దాడి చేసి వారి ఫోన్లను లాక్కున్నారు.
పెదనెమలిపూరి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తులసమ్మ నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారు. ఆమె కారును ధ్వంసం చేయడంతో పాటు మహిళా నాయకుల దుస్తులు లాగేందుకు ప్రయత్నించారు. వినుకొండ, ఈపూరులో పోలీసులు అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి బెదిరించారు. కారంపూడి ఎంపీటీసీ అభ్యర్థి మస్తాన్, పార్టీ నాయకుడు జిలానీ నామినేషన్లకు సిద్ధమవుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల ఎంపీడీవో ఆఫీస్ వద్ద నామినేషన్ వేయడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు.
పోలీసుల తీరుపై రెడ్డిగూడెం నాగారం జంక్షన్ వద్ద సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి నిరసన చేపట్టగా టీడీపీ మూకలు రాళ్లు రువ్వాయి. రాయవరంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు గోగుల నరసింహారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన తలకు గాయమైంది. మాచర్లలో సాక్షి మీడియాకు చెందిన భజరంగ్ ప్రసాద్, బాలాజీ, వంశీలపై తెలుగుదేశం గూండాలు వెంటాడి దాడి చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో టీడీపీ గూండాలు రణరంగం సృష్టించారు.
మాజీ మంత్రి రజినిని తోసేసిన ఎస్‌ఐ
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ ఫారాలు కూడా ఇచ్చేందుకు వీలులేకుండా మాజీ మంత్రి విడదల రజినిని మూడు రోజులుగా గృహ నిర్భంధంలో ఉంచిన పోలీసులు.. శుక్రవారం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. తనను కలవడానికి వచ్చిన జెడ్పీటీసీ అభ్యర్థి, దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయిని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులను రజిని ప్రశ్నించారు.
తన నివాసంలోకి వస్తున్న తన వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తూ, వారిని లోపలికి అనుమతించాలని కోరారు. దీంతో రజినిని చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక గట్టిగా తోసేసి కిందపడేశారు. దీంతో పక్కనే ఉన్న బండరాయి తగిలి రజిని చేతికి గాయమైంది. యడ్లపాడులో వైఎస్సార్‌సీపీ నామినేషన్లను పచ్చ మూక అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టాయి.


