అచ్యుతాపురం: బ్రాండిక్స్‌ కంపెనీలో విషవాయువు లీక్‌

Atchutapuram SEZ Porus Company Locals Fall Ill Doubts On Gas Leak - Sakshi

అచ్యుతాపురం (అనకాపల్లి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (ఎస్‌ఈజెడ్‌) లోని బ్రాండిక్స్‌ అపరెల్‌ పార్కు సిటీలో శుక్రవారం ఉదయం విషవాయువు లీకైంది. ఒక్కసారిగా కళ్ల మంటలు, శ్వాస తీసుకోలేకపోవడం, వాంతులతో అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులు విలవిల్లాడారు. అందరూ బయటకు పరుగులు తీశారు. సుమారు 178 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు.

వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇద్దరికి విశాఖ కేజీహెచ్‌ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, అస్వస్థతకు గురైన వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.

అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో బ్రాండిక్స్‌ సంస్థకు చెందిన దుస్తులు తయారు చేసే పెద్ద అపెరల్‌ పార్కు ఉంది. ఇక్కడ అందరూ మహిళలే పని చేస్తుంటారు. ఈ అపరెల్‌ పార్కులోని దుస్తులకు సంబంధించిన సీడ్స్‌ కంపెనీలో శుక్రవారం మ«ధ్యాహ్నం 11.20 గంటల సమయంలో గ్యాస్‌ లీకైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.

ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. కళ్ల మంటలు, వాంతులతో అల్లాడిపోయారు. ఆ సమయంలో సుమారు 800 మంది మహిళలు పనిచేస్తున్నట్లు సమాచారం. వారంతా బయటకు పరుగులు తీశారు. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. విషవాయువు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడి సిబ్బంది అంచనా వేసి ముందుగా ప్రాథమిక చికిత్స చేసే యత్నం చేశారు. సొమ్మసిల్లి పడిపోయిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే, ఈ గ్యాస్‌ ఎక్కడి నుంచి లీకయిందన్న విషయం వెల్లడి కాలేదు.   

గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి ఆరా
అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ పీల్చి ఇబ్బందిపడ్డ బాదితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, గ్యాస్‌ లీక్ అవుతున్న పరిశ్రమని అధికారులు కంట్రోల్ లోకి తీసుకోవాలని ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top