
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో తీసుకువెళుతున్న దృశ్యం
సమస్యల పరిష్కారాన్ని కోరుతూ.. ఛలో విద్యుత్‌సౌధ
కార్మికులను అడ్డుకుని అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వం
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘాల నాయకులు
సాక్షి, అమరావతి/గుణదల (విజయవాడ తూర్పు): విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో ప్రధాన కార్యాలయాల ముట్టడికి ఛలో విద్యుత్‌సౌధ కార్యక్రమాన్ని చేపట్టిన కార్మికుల్ని నిరంకుశంగా అడ్డుకుని అణచివేసింది. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (యూఈసీడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టిన ఈ ఆందోళనలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు, నాయకులు గురువారం విజయవాడ తరలివచ్చారు.
కార్మికుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ఉదయం 8 గంటల నుంచే అత్యుత్సాహంగా వ్యవహరించారు. రామవరప్పాడు రింగ్, విద్యుత్‌సౌధ, గుణదల వంతెన, గుణదల సెంటర్ నుంచి పడవలరేవు వరకు తనిఖీలు చేపట్టారు. కార్మికులను, నాయకులను మార్గంమధ్యలోనే అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 200 మందికిపైగా కార్మికులను అరెస్టుచేసి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఈ నేపథ్యంలో విజయవాడ గుణదలలోని విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వాలు మారుతున్నా మా గతి మారదా?
విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల్ని క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్), తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేసి వేతనాలు పెంచాలని కార్మికులు కోరుతున్నారు. పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని, వేతన వ్యత్యాసాలు లేకుండా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నారు. రూ.కోటి బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, పీస్ రేట్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని అభ్యర్థిస్తున్నారు.
చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ రూ.10 లక్షలు చెల్లించాలని.. తదితర సమస్యలపై తరబడి వినతిపత్రాలు ఇసూ్తనే ఉన్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఛలో విద్యుత్‌సౌధకు కార్మిక, ఉద్యోగసంఘాలు పిలుపునిచ్చాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అక్రమంగా కార్మికుల్ని, నాయకుల్ని అరెస్టు చేసి, నిర్భంధించటం, ఉక్కుపాదం మోపడం అన్యాయమని యూఈసీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు జల్లెడ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం నాయకులు విద్యుత్‌సౌధ ఆవరణలోని ఏపీ ట్రాన్స్‌కో అడిషనల్ సెక్రెటరీ పెద్ది రోజాకు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, లేదంటే ఈ పోరాటం మరింత తీవ్రతరమవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూనియన్ నాయకులు డి.సూరిబాబు, బి.సుమన్, ఎన్.విజయరావు, ఎ.వి.నాగేశ్వరరావు, ముజఫర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ విద్యుత్ సౌధ వద్ద గురువారం ఆందోళన చేపట్టిన కార్మికులు, నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఖండించారు.