
శ్రీసత్యసాయి జిల్లా కల్లి తండాలో మురళీ నాయక్‌కు వీడ్కోలు పలుకుతున్న అశేష జన సందోహం
స్వగ్రామంలో ముగిసిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు
పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమరుడైన ముదావత్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. తండోపతండాలుగా జనం శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాకు తరలివచ్చి వీర జవాన్‌కు అశ్రు నివాళులర్మించారు. జోహార్ మురళీ నాయక్.. జై జవాన్.. భారత్ మాతాకీ జై.. వీరుడా ఇక సెలవు.. అంటూ నినదించారు.
సాక్షి, పుట్టపర్తి: కశ్మీర్‌లో విధి నిర్వహణలో ఉండగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన అగ్నివీర్ ముదావత్ మురళి నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాలో మురళి నాయక్ భౌతికకాయాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. శనివారం రాత్రి భౌతికకాయం స్వగ్రామానికి చేరుకోగా.. అప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు తండోపతండాలుగా జనం తరలివచ్చి వీర జవాన్‌కు అశ్రు నివాళులర్పించారు.
జోహార్ మురళి నాయక్.. మురళి నాయక్ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై.. జై హింద్.. వీరుడా ఇక సెలవు.. అంటూ నినదించారు. తమ ఊరి యువకుడు దేశం కోసం ప్రాణాలర్పించడం ఓవైపు గర్వంగా ఉన్నప్పటికీ.. మరో వైపు తీవ్ర బాధతో ఉన్నామని గ్రామస్తులందరూ భావోద్వేగానికి గురయ్యారు. మురళి నాయక్ కుటుంబ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పర్యవేక్షణలో కల్లి తండాలో ఏర్పాట్లు జరిగాయి. కాగా, అగ్నివీర్ మురళి నాయక్ భౌతిక కాయం వద్ద ఘనంగా సైనిక వందనంతో నివాళులర్మించిన అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.
అంత్యక్రియల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈర లక్కప్ప, దీపిక, మక్బుల్ తదితరులు మురళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్పీ వి.రత్న నేతృత్వంలో కల్లి తండాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆస్తి ఇచ్చినా.. ఆనందం లేకపాయె
వీరజవాన్ మురళినాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల్లో ఇంటి నిర్మాణం, తండ్రి శ్రీరామ్ నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. తన వంతు సాయంగా మరో రూ.25 లక్షలు ఇస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ‘ఆస్తులు ఇచ్చినా.. ఇల్లు కట్టించినా.. అనుభవించేందుకు, ఆనందించేందుకు మా బిడ్డ లేకపాయె కద సారూ.. నా బిడ్డ దేశం కోసం ప్రాణాలొదిలాడని గర్వంగా అందరూ చెబుతున్నా.. కన్నపేగు బాధ ఎవరికి తెలుసయ్యా’ అంటూ మురళినాయక్ తల్లిదండ్రులు గుండెలు బాదుకుని విలపించారు. తామిక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరు మున్నీరయ్యారు.