లారీ ఢీకొని ఆర్మీ జవాను దుర్మరణం | army jawan ends life road accident in srikakulam district | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఆర్మీ జవాను దుర్మరణం

Jun 4 2025 11:46 AM | Updated on Jun 4 2025 11:47 AM

army jawan ends life road accident in srikakulam district

బొబ్బిలి రూరల్‌/బాడంగి: బొబ్బిలి మండలంలోని పారాది గ్రామం వద్ద  మంగళవారం లారీ ఢీ కొన్న ఘటనలో ఆర్మీ జవాను తూముల సత్యం(53) దుర్మరణం చెందారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన తూముల సత్యం మోటార్‌సైకిల్‌పై  బొబ్బిలి నుంచి రామభద్రపురం వెళ్తుండగా పారాది బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో సత్యం అక్కడికక్కడే మృతిచెందినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ సతీష్‌కుమార్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను స్థానికుల నుంచి ఆరాతీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శోకసంద్రంలో మృతుడి కుటుంబం, గ్రామస్తులు
ఆర్మీ జవాను తూముల సత్యం(52) రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో ఒక్కసారిగా ముగడ గ్రామం మూగబోయింది. మృతుడి తండ్రి సోములు గతంలో మృతిచెందగా తల్లి అప్పమ్మ మరోముగ్గురు సోదరులున్నారు.వారిలో సత్యం మూడవవాడు. ఆయన 1994లో ఆర్మీలో చేరగా   మిగిలినవారు వ్యసాయం చేసుకుంటున్నారు. ఆయనకు 2001లో నాగరత్నంతో వివాహం జరిగింది. వారికి బీటెక్‌ చదివిన అబ్బాయి అరవింద్, విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న అమ్మాయి హిమబిందు ఉన్నారు. ఆయన తొమ్మిదేళ్ల క్రితమే బొబ్బిలిలోని గొల్లవీధిలో ఇల్లు కొనుగోలు చేసి భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నారు. 

ఇదిలాఉండగా ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సైగా ఆయనకు ప్రమోషన్‌ రాగా ఛత్తీస్‌గఢ్‌  రాష్ట్రంలోని జగదల్‌పూర్‌లో  బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అక్క రామభద్రపురంలో ఉంటున్నందున తాను బుధవారం వెళ్లిపోతున్నానని చెప్పేందుకు బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో సత్యం మృతి చెందడంతో భార్యాపిల్లలు, తల్లి, సోదరులు, బంధువులు, గ్రామస్తులు  శోకసంద్రంలో మునిగిపోయారు. ఆర్మీ జవాను మృతదేహానికి బుధవారం ముగడ గ్రామంలో  ప్రభుత్వ లాంఛనాలతో   అంత్యక్రియలు జరగనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement