ఆరోగ్య పథకాల 'అమలులో ఏపీ టాప్‌'

AP Tops In Implementation of health schemes - Sakshi

అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణలో పురోభివృద్ధి 

వారికి మందులు అందించడంలోనూ చురుకైన పాత్ర 

గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలను వెనక్కు నెట్టిన రాష్ట్రం 

హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహణలో మెరుగైన పనితీరు 

ఆర్సీహెచ్‌ పోర్టల్‌కు వివరాల అనుసంధానంలో మొదటి స్థానం 

జాతీయ ఆరోగ్య మిషన్‌ తాజా పరిశీలనలో వెల్లడి 

ప్రధానంగా గర్భిణులు, చిన్నారుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి 

గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌  

సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిధిలోని ఆరోగ్య పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోభివృద్ధి సాధించింది. ఏడాదిన్నర కాలంలో కొన్ని పథకాల అమలులో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిశీలనలో వెల్లడైంది. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు చాలా పథకాల్లో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడేవి. ఈ పరిస్థితుల్లో గుజరాత్‌ను రెండో స్థానానికి నెట్టి ఏపీ మొదటి స్థానానికి వచ్చిందని ఎన్‌హెచ్‌ఎం అధికార వర్గాలు తెలిపాయి. మిగతా కొన్ని పథకాల అమలులోనూ త్వరలోనే ముందంజ వేసే అవకాశం ఉందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. 

ఎన్‌సీడీలో మొదటి స్థానం 
► నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) అంటే అసాంక్రమిక వ్యాధుల నియంత్రణకు జాతీయ ఆరోగ్యమిషన్‌ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఇందులో మన రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వాటిని గుర్తించేందుకు ఐదు కోట్ల జనాభాకు సంబంధించి ఇంటింటి సర్వే చేయించారు.
► 104 వాహనాల ద్వారా ప్రతి ఊరికీ వెళ్లి మందులు ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు మరింత మెరుగైనట్టు ఎన్‌హెచ్‌ఎం పరిశీలనలో వెల్లడైంది. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల (వీటినే ఇప్పుడు వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ అంటున్నాం) నిర్వహణలోనూ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.
► రాష్ట్రంలో 10 వేలకు పైగా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు ఉండగా, వీటిలో 8,604 సెంటర్లకు కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం కేంద్రాలకు మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌గా బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారిని నియమించారు.
► ఇందులో ప్రధానంగా 12 రకాల సేవలను అందించడంలో గణనీయమైన వృద్ధి సాధించారు. దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పైస్థాయి ఆస్పత్రులకు వెళ్లాల్సిన భారం తప్పింది.
► ఆర్సీహెచ్‌ (రీప్రొడక్టివ్‌ చైల్డ్‌ హెల్త్‌) అంటే గర్భిణుల ఆరోగ్యం, ప్రసవం అయ్యాక చిన్నారులకు సంరక్షణ వంటి వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర పరిధిలో పనిచేసే పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియలో ఎక్కడో ఉన్న ఏపీ ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది.
► మాతా శిశు మరణాల నియంత్రణ,  కుటుంబ నియంత్రణల్లో కేరళ, తమిళనాడులు ముందంజలో ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top