కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు 30% వెయిటేజీ  | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు 30% వెయిటేజీ 

Published Sun, Aug 20 2023 5:39 AM

30% Enhancement of SSA Employees Salary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద ఎంపికైన ఏఎన్‌ఎం–2 (సెకండ్‌ ఏఎన్‌ఎం)లకు తాజాగా తలపెట్టిన నియామకాల ప్రక్రియలో 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మరో 10 శాతం మార్కులను వెయిటేజీ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.

శనివారం కోఠిలోని తన కార్యాలయంలో ఆయన ఏఎన్‌ఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తం చేసినట్లు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం కింద రాష్ట్రంలో ప్రభుత్వం 5,198 మందిని రెండో ఏఎన్‌ఎంగా నియమించిందన్నారు. వీరి సర్వీసును క్రమబద్దికరించేందుకు ఎలాంటి ప్రాతిపదికలు లేవన్నారు. దీంతో క్రమబద్దికరణ అసాధ్యమని ప్రభుత్వం తేల్చిందని, ఈ క్రమంలో పోస్టుల లభ్యత ఆధారంగా నియామకాలు చేపడుతున్నప్పటికీ సర్వీసు ఆధారంగా గరిష్టంగా 30 శాతం మార్కులు వెయిటేజీ రూపంలో ఇస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,520 ఏఎన్‌ఎం ఖాళీల భర్తీకి తొలుత మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఆ తర్వాత మరిన్ని పోస్టులు మంజూరు కావడంతో 411 పోస్టులను అదనంగా కలిపామని, దీంతో పోస్టుల సంఖ్య 1,931కి పెరిగిందని చెప్పారు. తుది నియామకం జరిగే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అయితే వాటిని కూడా కలిపి నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల ఆధారంగా పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను క్రమబద్దికరించడం సాధ్యం కాదని, అందుకే అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్‌ రెండో వారంలో ఏఎన్‌ఎం అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.  

ప్రతి ఆర్నెళ్లకు రెండు పాయింట్లు..
రాష్ట్రంలో సెకండ్‌ ఏఎన్‌ఎంలుగా 2008 నుంచి నియమితులైన వారున్నారని, మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి ఆరునెలలకు 2 పాయింట్లు ఇస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారికి రెండున్నర పాయింట్లు ఇస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన వారికి 30 శాతం వెయిటేజీ వస్తుందని, ఈ క్రమంలో తాజా నియామకాల ప్రక్రియలో వంద శాతం అవకాశాలు వీరికే వస్తాయని వెల్లడించారు.

తాజాగా నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 53 సంవత్సరాలుగా ఖరారు చేశామని తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంలకు నెలవారీగా రూ.27,300 వేతనంగా ఇస్తున్నామన్నారు. ఏఎన్‌ఎంలు మొండిగా సమ్మె కొనసాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement