
ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మమ్మల్ని నిలదీస్తున్నాయి
మా పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి దారుణం.. రూ.25 వేల కోట్లకుపైగా బకాయిలు
ఆర్థికేతర డిమాండ్ అయిన పీఆర్‌సీని కూడా వేయరా?
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్న
విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి దారుణంగా ఉందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆర్థికేతర డిమాండ్ అయిన పీఆర్‌సీ వేయడానికి కూడా ముందుకురావడం లేదని తప్పుబట్టారు. మంగళవారం విజయనగరంలోని రెవెన్యూ హోంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం రాగానే ఐఆర్, డీఏలు, మంచి పీఆర్‌సీ అమలు, సీపీఎస్ రద్దు, బకాయిల చెల్లింపు... ఇలా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల వీడియోలను ప్రదర్శించారు.
వీటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని తమపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఉద్యోగి ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి సర్కారు వచ్చాక... గత ప్రభుత్వం నియమించిన పీఆర్‌సీ కమిషన్ రాజీనామా చేసిందని తెలిపారు. ఏడాది దాటినా కొత్త కమిషన్ వేయకపోవడానికి కారణం ఏమిటని నిలదీశారు. అసలు పీఆర్‌సీ వేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అని బొప్పరాజు ప్రశ్నించారు.
‘‘ఆర్థిక భారం లేని పీఆర్‌సీ కూడా వేయలేని ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏవిధంగా సంక్షేమం చేకూరుస్తుందని భావించాలి? కమిషన్ వేశాక పీఆర్‌సీ నివేదిక వచ్చేసరికి కనీసం రెండేళ్లు పడుతుంది. కూటమి ప్రభుత్వ ఉద్దేశం చూస్తుంటే ఉద్యోగులు పట్టించుకోరని భావిస్తున్నదా? ఇన్ని సంవత్సరాల జాప్యం కారణంగా ఒక్కో ఉద్యోగి ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర నష్టపోతున్నారు.
బకాయి ఉన్న మూడు విడతలు, తాజాగా నాలుగో విడత డీఏతో కలిపి దాదాపు 20 శాతం వేతన పెంపు జరగాల్సి ఉంది. డీఏలు, పీఎఫ్, జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి వివిధ బకాయిలు రూ.25 వేల కోట్లు ఉన్నాయి’’ అని వివరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.రాజేష్, జిల్లా కమిటీ అధ్యక్షుడు తాడి గోవింద, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.