ఎంపీ రఘురామపై కేసు నమోదు

AP Police Statement On Intelligence Constable Farooq Basha Assault - Sakshi

సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు అయ్యింది. రఘురామ కుమారుడు భరత్‌, పీఏ శాస్త్రి, ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ1గా రఘురామ, ఏ2 భరత్‌, ఏ3 సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై, ఏ4 కానిస్టేబుల్‌ సందీప్‌, ఏ5 పీఏ శాస్త్రిని చేర్చారు.

పోలీసుల ప్రకటన
ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ భాషాపై ఎంపీ రఘురామ కృష్టంరాజు కుటుంబ సభ్యులు దాడిపై ఏపీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. రఘురామ కృష్ణం రాజు ఇంటి వద్ద ఎలాంటి పోలీసులను పెట్టలేదన్నారు. ప్రధాని పర్యటన సందర్బంగా కానిస్టేబుల్‌ ఐఎస్‌బీ గేట్‌ వద్ద స్పాటర్‌గా ఉన్నాడని తెలిపారు. కానిస్టేబుల్‌ ఫరూక్‌ విధులకు, రఘురామ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రఘురామ ఇంటికి కిలోమీటర్‌ దూరంలో ఫరూక్‌ విధుల్లో ఉన్నాడని వెల్లడించారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని ఉన్నాతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు.

నా కాళ్లు, చేతులు కట్టేయమని చెప్పాడు: పరూక్‌
నన్ను చంపటానికి వచ్చావా అంటూ ‍ఎంపీ రఘురామకృష్ణంరాజు తనపై దాడి చేశారని కానిస్టేబుల్‌ ఫరూక్‌ తెలిపారు. తన కాళ్లు, చేతులు కట్టేయమని తన మనుషులకు చెప్పినట్లు పేర్కొన్నారు. కరెంటు షాక్ ఇవ్వాలంటూ తన  కుమారుడిని ఆదేశించారని అన్నారు. నా జుట్టు పట్టుకుని తలను గోడకేసి కొట్టారని తెలిపారు. ‘రఘురామ వెళ్లాక రంగంలోకి దిగిన ఆయన కుమారుడు భరత్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను రెచ్చగొట్టాడు.మా ఇంట్లో తింటూ, నెలనెలా మామూళ్లు తీసుకుంటూ వాడిని చిన్నగా కొడతారేంటంటూ మాట్లాడాడు.భరత్ హెచ్చరికతో పి.ఏ. శాస్త్రి, సీఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు మళ్లీ దాడికి దిగారు. చాలాసేపటి తర్వాత వచ్చిన పోలీసులు నన్ను రక్షించి గచ్చిబౌలి పీఎస్‌కు తీసుకెళ్లారు’ అని ఫరూక్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్‌ చేశారు. కొందరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లతో వచ్చి నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. అతని ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటలకు పైగా చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లోనే ఉండటం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top