ప్రేమించాలని వేధించి.. కాదంటే చంపేశాడు 

AP Police Reveal Ramya Assasinate Case In Guntur - Sakshi

ఏపీలోని గుంటూరులో రమ్య హత్య ఘటనపై పోలీసుల వెల్లడి

ఘటన జరిగిన కొద్దిగంటల్లోనే ప్రేమోన్మాది అరెస్ట్‌

నగరంపాలెం (గుంటూరు ఈస్ట్‌): మెకానిక్‌గా పనిచేసిన శశికృష్ణ తనను ప్రేమించాలని నల్లపు రమ్య వెంటపడ్డాడని, ఆమె తిరస్కరించడంతో హత్యచేశాడని ఏపీలోని గుంటూరు రేంజ్‌ ఇన్‌చార్జి డీఐజీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఆ ప్రేమోన్మాదిని గంటల వ్యవధిలోనే అరెస్ట్‌ చేశామన్నారు. ఆదివారం ఉదయం గుంటూరులో నడిరోడ్డుపైనే ఈ హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు సోమవారం ఈ ఘటన వివరాలు వెల్లడించారు. హంతకుడు కుంచాల శశికృష్ణతో రమ్యకు ఆరునెలల కిందట ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయమైందని తెలిపారు. గతంలో మెకానిక్‌గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న శశికృష్ణ.. కొద్దిరోజులుగా తనను ప్రేమించాలని రమ్య వెంటపడ్డాడని, దీంతో ఆమె మాట్లాడటం మానేయడంతో కక్ష పెంచుకున్నాడని వివరించారు.

ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆమె వెంటపడ్డాడని, ఆమె అభ్యంతరం చెప్పడంతో.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పొట్ట, మెడపై ఆరుచోట్ల పొడిచాడని తెలిపారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రమ్యను ఆమె అక్క మౌనిక గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిందని.. అప్పటికే రమ్య మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. మృతురాలి తండ్రి వెంకటరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం రాత్రి 8 గంటలకు నరసరావుపేట పరిధిలోని ములకలూరు గ్రామపొలాల్లో ఉన్న శశికృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని వివరించారు. రమ్య హత్య కేసుకు సంబంధించి పోలీసులపై పలు రాజకీయపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదని స్పష్టం చేశారు. 

రమ్య కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల భద్రత విషయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రేమోన్మాది దాడిలో మరణించిన రమ్య కుటుంబానికి ఆమె రూ.10లక్షల సాయం చెక్కును సోమవారం అందజేశారు. రమ్య కుటుంబానికి అండగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారని చెప్పారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top