‘సాక్షి’పై సర్కారు కక్ష సాధింపు | AP Police Over Action On Vijayawada Sakshi Head Office By Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై సర్కారు కక్ష సాధింపు

Oct 13 2025 5:11 AM | Updated on Oct 13 2025 8:08 AM

AP Police Over Action On Vijayawada Sakshi Head Office By Chandrababu Govt

విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఆదివారం పోలీసుల హల్‌చల్‌

ఎడిటర్‌కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో  పోలీసుల దాష్టీకం

నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తూ వేధింపులు 

నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చేందుకే ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు 

సోదాల పేరుతో విలేకరుల ఇళ్లలో చొరబడి దౌర్జన్యం 

అర్ధరాత్రి వేళ నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్‌చార్జి ఇంటికి వెళ్లి నోటీసులిచ్చిన పోలీసులు  

జర్నలిస్టుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తున్న బాబు సర్కారు 

ప్రజా కంటక పాలనను నిగ్గదీస్తుండటంతో కంటగింపు.. మోసాలు, వైఫల్యాలను ప్రశ్నిస్తుండటంతో అక్రమ కేసులు

రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛపై అక్రమ కేసులతో అణచివేత 

సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ కేసులు, నోటీసులతో పోలీసుల అరాచకం  

సాక్షి, అమరావతి: ప్రజాకంటక పాలనను నిగ్గదీస్తూ.. మోసాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై ఏపీలోని కూటమి సర్కారు అణచివేత చర్యలకు పాల్పడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని కల్తీ మద్యం పట్టి పీడిస్తున్నా, అమాయకుల ప్రాణాలను హరిస్తున్నా, చోద్యం చూస్తున్న సర్కారు.. క్షేత్రస్థాయి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై అక్రమ కేసులు బనాయించి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిట్టల్లా రాలిపోతున్న ప్రజల ప్రాణాలకు రక్షణ ఏదని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేపోతోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్‌కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల దాషీ్టకానికి దిగారు. 

నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చేందుకే సాక్షి ఎడిటర్, విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోంది. ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే కాకుండా ఘోర పాలనా వైఫల్యాలపై ప్రజల పక్షాన, ప్రజా గొంతుకగా నిలదీస్తున్న సాక్షిపై అక్రమ కేసులతో దాడికి తెగబడుతోంది. అధికార పీఠం ఎక్కింది మొదలు పోలీసులను ఉసిగొల్పుతూ.. యథేచ్ఛగా అక్రమ కేసులు బనాయిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ప్రతికా స్వేచ్ఛ.. భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థాన్ని విస్మరించి రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కక్షసాధింపులకు బరితెగిస్తోంది.  ప్రాథమిక హక్కులకు సైతం సంకెళ్లు వేసిన ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలదన్నేలా వ్యవహరిస్తోంది.  

దేశాన్ని కుదిపివేసిన నకిలీ మద్యం.. 
– సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసుల అరాచకం 
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం బాగోతం బయటపడటం.. అధికార టీడీపీకి చెందిన, అందులోనూ ముఖ్యనేతతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే సూత్రధారులని బహిర్గతం కావడం యావత్తు దేశాన్ని కుదిపి వేసింది. ఈ ఘటనపై నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ కథనాలు ప్రచురిస్తున్న సాక్షిని ఎలాగైనా అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ కూటమి సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, నెల్లూరు జిల్లా విలేకరులపై నెల్లూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో బనాయించిన అక్రమ కేసులే ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. అక్రమ కేసును అడ్డుపెట్టుకుని ఆదివారం తెల్లవారకముందే విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్‌చల్‌ చేశారు. గేట్లు తెరవకముందే తెల్లవారుజాము 5 గంటల నుంచి 9 గంటల వరకు అరాచకం సృష్టించారు.  

విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు 

సోదాల పేరిట ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడి..  
ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో అక్రమ కేసు నమోదు చేసిన వెంటనే నోటీసుల పేరుతో సాక్షి కార్యాలయాల్లో పోలీసులు దాడికి తెగబడ్డారు. విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో వీరంగం వేశారు. కార్యాలయం తాళాలు కూడా తెరవక ముందే నోటీసులు తీసుకోవాలంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇక కలిగిరిలో మరో అక్రమ కేసు పెట్టడమే కాకుండా  సోదాల పేరిట ఏకంగా విలేకరుల ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడి భయభ్రాంతులకు గురి చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులు.. దీనిపై కథనాలు రాసిన విలేకరులకు నోటీసులు ఇవ్వడం కూటమి సర్కారు కక్షసాధింపులకు పరాకాష్టగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా నోటీసులు ఇస్తూ.. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. 

ఆది నుంచి ‘సాక్షి’ ఒక్కటే టార్గెట్‌.. 
ప్రజల పక్షాన గొంతుకగా నిలుస్తున్న సాక్షిపై చంద్రబాబు ప్రభుత్వం ఆది నుంచి అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామ్య హక్కులు, విలువలను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారి ఎక్కడో చోట.. సంబంధం లేని వ్యక్తులతోనూ ఫిర్యాదు చేయించి సాక్షిపైకి పోలీసులను ఉసిగొల్పుతోంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో– అత్యంత ప్రధానమైన ఆరి్టకల్‌ 19 (1) (ఏ) ప్రకారం దక్కిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ.. పత్రికా స్వేచ్ఛపై దాడికి తెగబడుతూ దుస్సాహసానికి పాల్పడుతోంది. 



ఈ అక్రమ కేసులను న్యాయస్థానాలు తప్పుబడుతున్నా చంద్రబాబు సర్కారు తీరు మాత్రం మారట్లేదు. పత్రికలు, మీడియా, సోషల్‌ మీడియాలో భావ ప్రకటన విషయంలో అందే ఫిర్యాదులకు సంబంధించి కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసు శాఖతోపాటు జిల్లా మేజి్రస్టేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినప్పటికీ రాష్ట్ర పోలీసు శాఖ మాత్రం టీడీపీ పెద్దలకు జీహుజూర్‌ అనడానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్న ‘‘సాక్షి’’ని అక్రమ కేసులతో వేధించడమే విధానంగా మార్చుకున్నారు.  

మస్తాన్‌రెడ్డికి నోటీసులు అందజేస్తున్న పోలీసులు   

నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జీకి అర్థరాత్రి పోలీసుల నోటీసు
ఎక్సైజ్‌ అధికారులతో వరుసగా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు ఇప్పిస్తూ.. పాత్రికేయులను టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తూ, చంద్రబాబు సర్కారు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తోంది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్‌చార్జీ చిలకా మస్తాన్‌రెడ్డికి తాజాగా పోలీసులు అర్థరాత్రి సమయంలో ఆయన ఇంటికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. అయ్యప్పమాల ధారణలో ఉన్న ఆయన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ పొద్దున్నే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జర్నలిస్టుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ అర్థరాత్రి సమయంలో ఓ జర్నలిస్టు ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి.  

ఇదేం ప్రజాస్వామ్యం? 
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పేనా? ఇదేం ప్రజాస్వామ్యం?  
సాక్షి పత్రికపై ఎందుకు అంత క్షకపూరితంగా దాడులు చేస్తున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. 
– విశ్వసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే 

సుపరిపాలన అందిస్తే భయమెందుకు? 
సాక్షి మీడియా, ఎడిటర్, రిపోర్టర్లపై అక్రమ కేసులు పెడుతున్నారంటేనే మీరు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. మీరు సుపరిపాలన అందిస్తే మీడియాను చూసి భయపడాల్సిన అవసరం ఏముంది చంద్రబాబూ? 
– బుర్రా మధుసూదన రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement