భూగర్భ జలాల సంరక్షణలో ఏపీ ఆదర్శం | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాల సంరక్షణలో ఏపీ ఆదర్శం

Published Sat, Nov 4 2023 4:32 AM

AP is ideal in ground water conservation - Sakshi

సాక్షి, విశాఖపట్నం: భూగర్భ జలాల సంరక్షణలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ రోల్‌ మోడల్‌గా నిలిచిందని కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కాడా) స్పెషల్‌ కమిషనర్‌ పీఎస్‌ రాఘవయ్య వెల్లడించారు. రాష్ట్రంలో సమీకృత సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి పరివర్తన పథకం సత్ఫలితాలిస్తోందని చెప్పారు. విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజి (ఐసీఐడీ) రెండోరోజు సదస్సు లో రాఘవయ్య వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.

రాష్ట్రంలో సుమారు 40 వేల చిన్న తరహా సాగునీటి చెరువులున్నాయన్నారు. వీటిలో వెయ్యి చెరువుల ఆధునికీకరణ చేపడుతున్నామని.. ఇందులో భాగంగా చెరువుల లోతు, వాటి గట్లను పటిష్టం చేయడంతోపాటు వీటి కింద పంట కాలువలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంకు రూ.1,600 కోట్ల నిధులను ఇందుకు సమకూర్చిందని రాఘవయ్య చెప్పారు. ప్రస్తుతం 568 చెరువుల ఆధునికీకరణ జరుగుతోందని, 102 చెరువుల పనులు పూర్తయ్యాయని, ఇప్పటివరకు రూ.219 కోట్లు ఖర్చుచేశామని ఆయన వివరించారు.  

2025 నాటికి వెయ్యి చెరువుల అభివృద్ధి.. 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలవల్ల చెరువులను వాస్తవ స్థితికి తీసుకురావడం,పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించడం, ఎక్కువ పంటలు పండించడం, అధిక దిగుబడులు సాధించడం, వైవిధ్య పంటల సాగువైపు రైతులను మళ్లించడం, మేలైన వ్యవసాయ పద్ధతులను పాటించడం వంటి మంచి ఫలితాలు సాధిస్తున్నామని రాఘవయ్య వివరించారు. ఒడిశా, మహారాష్ట్రల్లో అమలవుతున్నా అక్కడ మందకొడిగా సాగుతోందన్నారు. ఇక ఈ పథకం కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన వెయ్యి చెరువుల ఆధునికీకరణ పనులను 2025 అక్టోబరు నాటికి  పూర్తిచేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement