ఏపీ ఉద్యాన సమాచార, నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు
వ్యవసాయ శాఖలో ఇప్పటికే ‘ఏపీ ఎయిమ్స్ 2.0’ పేరిట ఏకీకృత డిజిటల్ వ్యవస్థ
ఇప్పుడు మరో వ్యవస్థ పేరు చెప్పి రూ.20.62 కోట్లు దుబారా
వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్‌కు నిర్వహణ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ‘మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కారు. పంటలకు సాగునీరు అందక అన్నదాతలు అల్లాడుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని పూర్తిగా గాలికొదిలేసింది. పంటల్ని కాపాడేందుకు కనీస చర్యలు కూడా చేపట్టని ప్రభుత్వం ఉద్యాన రైతులను ఉద్దరిస్తున్నట్టు డప్పు కొట్టుకుంటూ డిజిటల్ సేవల పేరిట రూ.కోట్లను దుబారా చేస్తోంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఏకీకృత డిజిటల్ వ్యవస్థ ‘ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీ ఎయిమ్స్) 2.0’ అనే డిజిటల్ వ్యవస్థ నిర్వహిస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉద్యాన శాఖలో డిజిటల్ సేవల కోసం ప్రత్యేకంగా ఏపీ ఉద్యాన సమాచార, నిర్వహణ వ్యవస్థ (ఏపీహెచ్‌ఐఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.20.62 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధుల మంజూరుకు పరిపాలన ఆమోదం ఇస్తూ డిజిటల్ వ్యవస్థ ఏర్పాటుకు విధివిధానాలతో ఆదివారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరేళ్ల ఒప్పందం.. ఏడాదిలో సేవలు
డిజిటల్ రూపంలో ఉద్యాన సమాచార వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతలను వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్‌కు అప్పగిస్తున్నారు. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.11.77 కోట్లు, ఐదేళ్లపాటు నిర్వహణ కోసం మరో రూ.8.85 కోట్లు కేటాయించారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఐదేళ్ల పాటు ఈ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రాజెక్టును నాలుగు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
ఎయిమ్స్ 2.0 ఉన్నా..
ఇప్పటికే వ్యవసాయ శాఖకు ‘ఏపీ ఎయిమ్స్ 2.0’ అనే డిజిటల్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనికి అనుబంధంగా ఉద్యాన పంటలకు సంబంధించిన సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తే సరిపోతుందని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. ఉద్యాన శాఖ కోసం ప్రత్యేక డిజిటల్ సేవల పేరుతో నిధులు స్వాహా చేసేందుకే ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.20.62 కోట్లను ప్రభుత్వం అప్పనంగా దోచిపెట్టేందుకే ఉద్యాన శాఖ పేరిట ప్రత్యేకంగా డిజిటల్ సేవలను తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


