
సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో కారిడార్‌కు ఎలాంటి అభ్యంతరం తెలపకుండా, ఎలాంటి పరిహారం కోరకుండా భూమిని ఉచితంగా అందజేస్తానంటూ అఫిడవిట్ ఇస్తేనే భవన నిర్మాణానికి అనుమతినిస్తామని 2016లో అప్పటి విజయవాడ మునిసిపల్ కమిషనర్ షరతు విధించడంపై హైకోర్టు మండిపడింది. అంతేకాకుండా అందుకు అంగీకరించకపోవడంతో మునిసిపల్ కమిషనర్ భవన నిర్మాణానికి అనుమతిని నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. మునిసిపల్ కమిషనర్ ఉత్తర్వులను చట్ట విరుద్ధమని, ఏకపక్షమని, అహేతుకమని ప్రకటించింది. అంతేకాకుండా అప్పటి విజయవాడ మునిసిపల్ కమిషనర్ రూ.25 వేలను ఖర్చుల కింద పిటిషనర్‌కు చెల్లించాలని ఆదేశించింది. పరిహారం కోరకుండా ఉచితంగా స్థలం ఇవ్వాలని కోరడం పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఆస్తి హక్కును హరించడమే అవుతుందని తేల్చిచెప్పింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు. అప్పటి కమిషనర్ ప్రస్తుతం ఇతర పోస్టులో ఉన్నా, పదవీ విరమణ చేసినా కూడా ఆయనకు ఈ తీర్పు కాపీని పంపాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. పిటిషనర్ భవన నిర్మాణానికి అనుమతినిచ్చే విషయాన్ని తాజాగా పరిశీలించాలని విజయవాడ మునిసిపల్ అధికారులకు న్యాయమూర్తి సూచించారు.
విజయవాడ బందరు రోడ్డులో 346 చదరపు గజాల స్థలాన్ని వేణుగోపాలరావు అనే వ్యక్తి నుంచి బొమ్మదేవర వెంకట సుబ్బారావు అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఈ స్థలంలో భవన నిర్మాణం అనుమతినివ్వాలంటే మెట్రో కారిడార్ నిర్మాణం కోసం భూమి అవసరమైనప్పుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా, ఎలాంటి పరిహారం కోరకుండా భూమిని ఉచితంగా ఇస్తానని అఫిడవిట్ ఇవ్వాలని కమిషనర్ 2016లో ఉత్తర్వులు ఇచ్చారు, ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.