
సాక్షి, అమరావతి: చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించలేరని, ఆ దిశగా కోర్టులు కూడా ఆదేశాలు ఇవ్వలేవని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు రాజధానులపై చట్టం చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ వాదనలపై స్పందించలేమని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. మీ అందరి వాదనలు ప్రభుత్వాన్ని చట్టాలు చేయకుండా ముందే నిలువరించాలని కోరుతున్నట్లు ఉందని, అది ఎలా సాధ్యమని ప్రశ్నించింది. పాలన వికేంద్రీరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో మనుగడలో ఉన్న అభ్యర్థనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి.
ప్రభుత్వం, సీఆర్‌డీఏ తదితరుల వాదనల నిమిత్తం విచారణను ఫిబ్రవరి 2కి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటి వరకు అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలకు గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్‌కో) ఉత్తర్వులు అడ్డంకి కాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరోసారి పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజుల త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: (రాయలసీమ ప్రజలకు క్షమాపణలు: సోము వీర్రాజు)
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిన నేపథ్యంలో ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? ఏవి నిరర్థకమయ్యాయి తదితర వివరాలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందుంచారు. వాటి ఆధారంగా ధర్మాసనం విచారణను కొనసాగించింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు విన్నది. మూడు రాజధానుల విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్రానికి లేదని, అలాంటప్పుడు ఉపసంహరణ అధికారమూ రాష్ట్రానికి ఉండదని వారు కోర్టుకు నివేదించారు. మళ్లీ చట్టాలు తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోందని, అలాంటి చట్టాలు తీసుకురాకుండా నియంత్రించాలని కోరారు.
హైకోర్టులో విచారణను అడ్డుకునేందుకే ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందన్నారు. ఇలా పలుమార్లు చేసిందని, ఓసారి ఏకంగా ప్రధాన న్యాయమూర్తి మీదనే ఫిర్యాదు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన ఉన్నం మురళీ ధరరావు వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున హాజరవుతున్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేసుతో సంబంధం లేనివి, పిటిషన్‌లలో ప్రస్తావించని విషయాలపై వాదనలు వినిపిస్తున్నారంటూ అభ్యం తరం వ్యక్తంచేశారు. అందరి వాదనలు విన్న ధర్మా సనం తదుపరి విచారణను వాయిదా వేసింది.