ప్రభుత్వ ప్రతీ చర్యను పిల్‌తో సవాలు చేయలేరు

AP High Court on Land Change Nandyal Agricultural Research Center - Sakshi

ఏదైనా... ప్రజల కోసమే కదా?

మెడికల్‌ కాలేజీలు లేకుంటే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

ప్రస్తుత పరిస్థితుల్లో వాటి ఏర్పాటు ఎంతైనా అవసరం

నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం భూమి బదలాయింపుపై హైకోర్టు వ్యాఖ్యలు

కౌంటర్ల దాఖలుకు ఆదేశం.. విచారణ నవంబర్‌ 18కి వాయిదా 

సాక్షి, అమరావతి: వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎంత ముఖ్యమో వైద్య కళాశాలలు కూడా అంతే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. వైద్య కళాశాలలు కూడా ప్రజా సంక్షేమం కోసమేనని వ్యాఖ్యానించింది. మెడికల్‌ కాలేజీలు లేకుంటే ప్రజల ఆరోగ్యం తీవ్ర స్థాయిలో ప్రభావితమవుతుందని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య కళాశాలల ఏర్పాటు ఎంతైనా అవసరమని గుర్తు చేసింది. ప్రభుత్వ ప్రతీ చర్యను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) పేరుతో సవాల్‌ చేయడానికి వీల్లేదని పేర్కొంది. వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, వైద్య కళాశాలను నిర్మించినా అంతిమంగా అది ప్రజల కోసమేనని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇచ్చే ప్రత్యామ్నాయ భూమిలో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.

నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం కోసం బదలాయించేలా ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీ పాలక మండలి చేసిన తీర్మానంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, విశ్వవిద్యాలయ వర్గాలను హైకోర్టు ఆదేశించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, పాలక మండలి చైర్మన్, విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌లకు నోటీసులు జారీ చేస్తూ ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో దీన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

తదుపరి విచారణను నవంబర్‌ 18కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించేందుకు వీలుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది జూన్‌ 20న చేసిన తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరాథరామిరెడ్డి మరో నలుగురు దాఖలు చేసిన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.

పరిశోధన కేంద్రానికి 120 ఏళ్ల చరిత్ర...
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ముఖ్యమైనదన్నారు. ఇక్కడ అత్యంత అరుదుగా లభించే వంగడాలను సృష్టిస్తున్నారని, పరిశోధన కేంద్రానికి 120 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. ఎంతో పేరు పొందిన కర్నూలు సోనా మసూరి బియ్యం కూడా ఇక్కడే అభివృద్ధి అయిందన్నారు. వర్సిటీ వర్గాలు వ్యతిరేకిస్తున్నా పాలక మండలి పట్టించుకోకుండా భూమిని ప్రభుత్వానికి బదలాయించేలా తీర్మానం చేసిందన్నారు. 

ప్రత్యామ్నాయ భూమి తీసుకోండి...
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ మరోచోట పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నించింది. పరిశోధన కేంద్రంలో భూమి అత్యంత కీలకమని, ప్రస్తుతం ఉన్న స్థితికి తీసుకురావాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందని వివేక్‌ పేర్కొన్నారు. అయితే వ్యవసాయ పరిశోధన ఎంత ముఖ్యమో వైద్య కళాశాల కూడా అంతే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతీ చర్యను ఇలా పిల్‌ పేరుతో సవాలు చేయడానికి వీల్లేదని తెలిపింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమిని ఇస్తున్నప్పుడు తీసుకోవాలని సూచించింది. కానీ ఇప్పుడే ఆ భూమి కూడా ఇవ్వడం లేదని, ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు జీవోను అబయన్స్‌లో ఉంచుతూ జీవో ఇచ్చారని వివేక్‌రెడ్డి నివేదించారు.

అబయన్స్‌ జీవో ఉపసంహరించుకోవాలని ఏఏజీ సూచించారు..
ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది ఖాదర్‌ మస్తాన్‌ స్పందిస్తూ ప్రత్యామ్నాయంగా 50 ఎకరాల కేటాయింపు జీవోను అబయన్స్‌లో ఉంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సూచించారని అయితే కార్యదర్శి పొరపాటున జీవో ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top