ఇంటింటికీ రేషన్‌.. తొలగిన అడ్డంకి

AP High Court has given permission to the implementation of the door-to-door ration scheme - Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల అమలు నిలిపివేత

మార్చి 15 వరకు పథకాన్ని అడ్డుకోవద్దన్న హైకోర్టు

ఈ పథకం వెనుక పెద్ద సదుద్దేశం ఉందని వ్యాఖ్య

పల్లెల్లో కదిలిన రేషన్‌ వాహనాలు

ఇంటింటికీ రేషన్‌ పథకం వెనుక పెద్ద సదుద్దేశం ఉంది. ఈ పథకం కొత్తది కాదు. దీన్ని ప్రభుత్వం ఇప్పటికే పట్టణాల్లో అమలు చేస్తోంది. ఈ పథకం కోసం ఆపరేటర్లు బ్యాంకుల రుణాలు పొంది వాహనాలు కొన్నారు. ఎన్నికల కమిషన్‌ చెప్పినట్టు వాహనాలకు మళ్లీ తటస్థ రంగులు వేయాలంటే భారీ ఖర్చు అవుతుంది. వాహనాలపై సీఎం ఫొటోలు ఉండటంపై ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం చెబుతోంది. సీఎం ఫొటో ఉండరాదన్న నిషేధం ఏదీ లేదు. ఆ వాహనాలపై రంగులను ఓ రాజకీయ పార్టీకి ఆపాదించడం సరికాదు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు సరికాదు.     
– హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు

సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్‌’ పథకం అమలుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ పథకం అమలుకు బ్రేక్‌ వేస్తూ ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను మార్చి 15వ తేదీ వరకు నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు సంచార వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకోవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ‘ఇంటింటికీ రేషన్‌’ పథకానికి బ్రేక్‌ వేస్తూ ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరించారు.

సీఎం ఫొటో వాడటంపై నిషేధం లేదు
‘ఇంటింటికీ రేషన్‌ పథకం వెనుక పేదలకు, అవసరం ఉన్న ప్రజలకు ఆహార ధాన్యాలు అందచేయాలన్న భారీ సదుద్దేశం, ప్రయోజనం దాగి ఉంది. ప్రజల సంక్షేమం, ఆరోగ్యమే సుప్రీం లా. అదే ఈ మధ్యంతర ఉత్తర్వుల జారీకి కారణం. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ పథకం అమలవుతోంది. 3.25 కోట్ల మంది లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను అందించేందుకు వేల వాహనాలను ఆపరేటర్లు కొనుగోలు చేశారు. దీని కోసం వారు డబ్బు పెట్టుబడిగా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారు. వాహనాలకు రీ పెయింటింగ్‌ నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే సమయానికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సంచార వాహనాలకు తటస్థ రంగులు వేసేంత వరకు ఈ పథకం అమలును నిలిపేయడం సరికాదన్నది ఈ కోర్టు ప్రాథమిక అభిప్రాయం. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ న్యాయస్థానం ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతోంది’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాహనాలపై రంగులు, ఫొటోల విషయమై దాఖలైన ఓ కేసులో విచారణ జరిపిన సుప్రీం కోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ ప్రకటనల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దల ఫొటోలను ఉపయోగించడంపై సుప్రీం కోర్టు ఎలాంటి నిషేధం విధించలేదని, ముఖ్యమంత్రి ఫొటో కూడా ఉండొచ్చని తెలిపిందన్నారు. వాహనాలపై ఉపయోగించినవన్నీ సాధారణ రంగులేనని, అధికార పార్టీ రంగులను పోలి ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్‌ అంతిమ నిర్ణయానికి రావడం ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఎంతమాత్రం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

పల్లెల్లో కదిలిన వాహనాలు
‘ఇంటింటికీ రేషన్‌’ పథకం అమలుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. పల్లెల్లోనూ ఇంటింటికీ సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా మొబైల్‌ వాహనాలు సోమవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా ముందుకు కదిలాయి. ఇంటింటా సరుకులు పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అధికారులకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 22 లక్షల కార్డుదారులకు ఇంటివద్దే సరుకులు పంపిణీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎక్స్‌–అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ వెల్లడించారు. రేషన్‌ షాపుల వద్ద క్యూ లైన్లకు స్వస్తి పలకడం.. తూకంలో అక్రమాలు, మోసాలకు తావు లేకుండా నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులను పేదల గడప వద్దే అందివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 9,260 మొబైల్‌ వాహనాలను కొనుగోలు చేసిన విషయం విదితమే. వాటిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నెలలో ప్రారంభించగా.. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.45 కోట్లకు పైగా కార్డుదారులకు ఇంటింటింకీ వెళ్లి రేషన్‌ సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో ఈ వాహనాను ఆపాలంటూ ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులివ్వడంతో గ్రామాల్లో ఇంటింటికీ రేషన్‌ కార్యక్రమం నిలిచిపోయింది. ఎస్‌ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో రేషన్‌ పంపిణీకి మార్గం సుగమమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top