నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP High Court Adjourned SEC Petition Hearing To January 18th - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్‌ దుర్గాప్రసాద్, జస్టిస్‌ కృష్ణ మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. ఎస్‌ఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని భావిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 18కు వాయిదా వేసింది. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకై ఎలక్షన్‌ కమిషన్,‌ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ ఎన్నికల షెడ్యూల్‌ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమన్న న్యాయస్థానం... ఎస్‌ఈసీ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది.(చదవండి: నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం)

అదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్‌ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ.. ఎస్‌ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఈ సందర్భంగా తప్పుబట్టింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హౌస్‌ మోషన్‌ రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top