ఈడబ్ల్యూఎస్‌ సీట్లన్నీ కన్వీనర్‌ కోటాలోనే 

AP Govt taking Actions that without burden of fees on EWS students - Sakshi

సూపర్‌న్యూమరరీ కింద కేటాయింపు

సెట్స్‌ కమిటీ నిర్ణయం 

ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులపై ఫీజుల భారం లేకుండా చర్యలు 

మేనేజ్‌మెంట్‌ కోటాలో కేటాయింపు వల్ల 3 రెట్ల ఫీజు భారం 

నేడు ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) విద్యార్థులకు 10 శాతం కోటా అమలుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెట్స్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లను పూర్తిగా కన్వీనర్‌ కోటాలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఏపీఈఏపీ సెట్‌ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్, చీఫ్‌ క్యాంపు ఆఫీసర్‌ (అడ్మిషన్స్‌) డాక్టర్‌ బల్లా కళ్యాణ్, సెట్స్‌ ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం కాలేజీల్లోని కోర్సుల్లో పది శాతం సీట్లను సూపర్‌న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు అదనంగా ఏర్పాటు చేయాలి.

రాష్ట్రంలోని వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లోని సీట్లలో 70 శాతం కన్వీనర్‌ కోటా కింద, 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కింద కేటాయిస్తున్నారు. కన్వీనర్‌ కోటాలో 7 శాతం, మేనేజ్‌మెంట్‌ కోటాలో 3 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కింద ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు అదనంగా కేటాయిస్తున్నారు. అయితే కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందే విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్‌ చేస్తోంది. వారిపై పైసా భారం పడదు. మేనేజ్‌మెంట్‌ కోటా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. ఆ కోటాలో సీట్లు పొందే ఈడబ్ల్యూఎస్‌ విద్యార్ధులు ఫీజు వారే చెల్లించాలి. ఇది కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజుకంటే ఈ ఏడాది 3 రెట్లు అధికంగా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలపై ఇంత ఫీజు భారం సరికాదన్న ప్రభుత్వ అభిప్రాయం మేరకు మొత్తం 10 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలోనే కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనివల్ల ఆ విద్యార్థులపై ఫీజుల భారం పడదు. ప్రైవేటు యూనివర్సిటీల్లో కేంద్ర చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్‌ కోటాకు అవకాశం లేనందున రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా ఆ కోటా అమలు కాదు. 

నేడు ఈఏపీ సీట్ల కేటాయింపు 
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీ సెట్‌–2021 సీట్ల కేటాయింపు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈనెల 10వ తేదీనే సీట్లు కేటాయించాల్సి ఉన్నా, ఈడబ్ల్యూఎస్‌ కోటాపై నిర్ణయం తీసుకోవలసి ఉండటంతో వాయిదా పడింది. గురువారం దీనిపై నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం నుంచి సీట్లు కేటాయిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top