AP TIDCO Houses: AP Govt Helping Hand To Beneficiaries Of Houses To Poor People - Sakshi
Sakshi News home page

AP TIDCO Houses: సొంతింటి కల.. నెరవేరుతోందిలా

Jul 24 2022 3:28 AM | Updated on Jul 24 2022 11:28 AM

AP Govt Helping Hand To beneficiaries of houses to poor people - Sakshi

సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కల సాకారానికి సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో చర్యలు చేపడుతోంది. ఏకంగా 30.76 లక్షల పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసేందుకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఉచితంగా ఇంటి స్థలాలను పంపిణీ చేసింది. అంతటితో వదిలేయకుండా.. నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయం అందిస్తోంది. ఇదికాక.. సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి సరఫరా, లేఅవుట్‌లలో మౌలిక వసతులు ఇలా అనేక విధాలుగా సర్కారు సాయం చేస్తోంది. మొత్తంమీద ఇలా లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన, బిల్లు చెల్లింపులు, సబ్సిడీల రూపంలో రూ.లక్ష కోట్లకు పైగా ప్రభుత్వం పేదలకు మేలు చేకూరుస్తోంది.

బాబు హయాంలో బిల్లు, సిమెంట్‌ మాత్రమే 
ఇక టీడీపీ హయాంలో సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు మాత్రమే అనుమతులిచ్చారు. కానీ, దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేసిన దాఖలాల్లేవు. పైగా.. ఇళ్ల మంజూరు జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది. అంతేకాక.. లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి బిల్లుతో పాటు సిమెంట్‌ను మాత్రమే సబ్సిడీపై ప్రభుత్వం అందించింది. యూనిట్లు కూడా అప్పట్లో చాలా తక్కువ. దీంతో 2014 నుంచి 2019 మధ్య 4,07,544 టన్నుల సిమెంట్‌ను మాత్రమే లబ్ధిదారులకు సరఫరా చేశారు. మొత్తంమీద టీడీపీ హయాంలో ఇల్లు కావాలనుకునే వారికి పెద్దగా ఒరిగింది ఏమీలేదు. అప్పట్లో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నా.. టీడీపీకి బాకాలూదే ఎల్లో మీడియాకు చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు సరికదా.. దానిని మహాద్భుతంలా చిత్రీకరించాయి.
పక్కాఇళ్లు లేక ముందు గుబ్బల కనక విజయలక్ష్మి నివసించిన పూరి గుడిసె, ప్రస్తుతం నిర్మించుకున్న పక్కా ఇంటి ముందు గుబ్బల కనక విజయలక్ష్మి 

నిర్మాణానికీ సర్కారు చేయూత
పథకం కింద తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచితంగా 20 టన్నుల ఇసుక, సబ్సిడీపై 100 బస్తాల సిమెంట్, 480 కిలోల ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం అందిస్తోంది. ఇలా ఇప్పటివరకూ 34,93,026 టన్నుల ఇసుక, 8,16,280 టన్నుల సిమెంట్, 66,880 టన్నుల ఇనుము లబ్ధిదారులకు సరఫరా చేశారు. ఈ క్రమంలో రూ.15 వేల విలువైన ఇసుక, సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రి సబ్సిడీపై అందించడం ద్వారా రూ.40వేల మేర లబ్ధిదారులకు ఆదా అవుతోంది. ఈ లెక్కన ఒక్క నిర్మాణ సామాగ్రి రూపంలోనే ఒక్కో లబ్ధిదారుడికి రూ.55వేల మేర మేలు చేకూరుస్తోంది. దీంతోపాటు పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున బ్యాంకు రుణాలు అందిస్తోంది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సయ్యద్‌ ఫజ్లునా. ఈమెది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. భర్త రియాజ్, కుమారుడు సలీం, కోడలు, చిన్నపిల్లతో కలిసి జయనగర్‌లో నివాసముంటోంది. కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. వీరికి సొంతిల్లు లేదు. 2019 ముందువరకూ చాలాసార్లు ప్రయత్నించినా మంజూరుకాలేదు. కానీ, సీఎం జగన్‌ ప్రభుత్వం స్థలం, ఇల్లు మంజూరు చేస్తోందని తెలిసి ఫజ్లునా దరఖాస్తు చేసింది.  కురాకులతోట లేఅవుట్‌లో స్థలం మంజూరుతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులూ లభించాయి. ప్రభుత్వం ఉచితంగా ఇసుక, సబ్సిడీతో సిమెంట్, ఇనుము కూడా అందించింది. దీంతో.. ‘మాకు గతంలో సొంతిల్లు లేకపోవడంతో బంధువులు, చుట్టుపక్కల వాళ్లకు మాపై చిన్నచూపు ఉండేది. ఇప్పుడు మా సొంతింటి కలను నెరవేరుస్తున్న జగన్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు’.. అని ఫజ్లునా భావోద్వేగానికి గురైంది. 

ఇంటికి క్యూరింగ్‌ చేస్తున్న లబ్ధిదారు సయ్యద్‌ ఫజ్లునా 

30 ఏళ్ల కల నెరవేరింది
నా భర్త పడాల నర్సింహులు సైకిల్‌పై తిరుగుతూ పూల వ్యాపారం చేస్తుంటాడు. మేం 30ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటికోసం గతంలో ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మాకు స్థలం, ఇల్లు మంజూరైంది. నిర్మాణం పూర్తయింది. మా ఇంటి కల నెరవేరింది. 
– పడాల జగదాంబ, మార్టేరు, పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి

పూరి గుడిసె నుంచి పక్కా ఇంటికి..
మేం గుడిసెలో ఉంటున్నాం. వర్షాకాలంలో మా పరిస్థితి చాలా దారుణం. గతంలో చాలాసార్లు ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నాం. ఫలితంలేదు. ప్రస్తుత ప్రభుత్వం స్థలం, ఇల్లు మంజూరు చేసింది. ఆర్థిక సహాయమూ చేయడంతో సొంత ఇంటిని నిర్మించుకున్నాం. పూరిగుడిసె నుంచి పక్కా ఇంటికి మారాం. సొంతింట్లోకి అడుగు పెడతామని ఊహించలేదు. 
– గుబ్బల కనక విజయలక్ష్మి, నర్సింగపురం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement