హంద్రీ–నీవా సామర్థ్యం పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌ | AP Govt Green signal for Handri-Neeva capacity increase | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవా సామర్థ్యం పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌

May 5 2021 2:56 AM | Updated on May 5 2021 9:18 AM

AP Govt Green signal for Handri-Neeva capacity increase - Sakshi

హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు అభివృద్ధి చేసే పనులను చేపట్టడానికి మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కృష్ణా వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి.. రాయలసీమను సుభిక్షం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు అభివృద్ధి చేసే పనులను చేపట్టడానికి మంగళవారం మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.6,182 కోట్ల వ్యయంతో పనులను చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద నీటిని తరలించి.. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.

కృష్ణా నదికి వరద వచ్చే 120 రోజుల్లో.. రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలు తరలించేలా పనులు చేపట్టారు. పరీవాహక ప్రాంతంలో అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి కృష్ణా నది ద్వారా వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. అతివృష్టి ఏర్పడినప్పుడు ఒకేసారి గరిష్టంగా వరద వస్తోంది. కానీ.. ఆ స్థాయిలో వరదను ఒడిసి పట్టే పరిస్థితులు లేకపోవడంతో ఆ జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి. వరద నీటిని గరిçష్ట స్థాయిలో ఒడిసి పట్టడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ, ఎత్తిపోతల సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించారు.

221.106 కి.మీ. పొడవున కాలువ విస్తరణ
శ్రీశైలం జలాశయంలో మల్యాల పంప్‌ హౌస్‌ ద్వారా హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 8 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. 216.3 కి.మీ. పొడవున్న ప్రధాన కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. మల్యాల పంప్‌హౌస్‌కు నీటిని తెచ్చేందుకు జలాశయంలో 4.806 కి.మీ. పొడవున అప్రోచ్‌ చానల్‌ తవ్వారు. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలంటే అప్రోచ్‌ చానల్‌తోపాటు ప్రధాన కాలువను విస్తరించాలి. అంటే.. మొత్తం 221.106 కి.మీ. పొడవున ప్రధాన కాలువను విస్తరించే పనులను ప్రభుత్వం చేపట్టనుంది. ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న ఎత్తిపోతలను ఆ మేరకు విస్తరించనుంది.

78 నుంచి 80 రోజుల్లోనే 40 టీఎంసీలు..:
ప్రస్తుత డిజైన్‌ మేరకు హంద్రీ–నీవా నుంచి 40 టీఎంసీలను తరలించడానికి 120 రోజులు సమయం పడుతోంది. కృష్ణా నదికి అన్ని రోజుల్లోను వరద ప్రవాహం ఉండటం లేదు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 830 అడుగుల మేర నీటి మట్టం ఉంటేనే మల్యాల ఎత్తిపోతల ద్వారా తరలించే అవకాశం ఉంది. కానీ.. తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి రోజుకు 4 టీఎంసీల చొప్పున దిగువకు తరలించడం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం ఆ స్థాయిలో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కృష్ణా వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టేందుకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు అభివృద్ధి చేసే పనులను చేపట్టింది. దీనివల్ల 78 నుంచి 80 రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించడానికి అవకాశం ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement