మత్స్యకారులకు మరింత మేలు

AP Government focus on setting up harbor based industries - Sakshi

హార్బర్ల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి

జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద

సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల పెంపు, మత్స్యకారులు చేపల వేటకు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తప్పించడం, వారికి అధిక ఆదాయ మార్గాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పది ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తోంది. ఇందుకు సుమారు రూ.3,500 కోట్లు వ్యయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు హార్బర్ల ఆధారంగా పనిచేసే పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.1,522.80 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్ల పనులు పూర్తి కావస్తున్నాయి. దీంతో ఈ హార్బర్ల నుంచి వచ్చే మత్స్య సంపద ద్వారా మత్స్యకారులు అధికాదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.

ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద రూ.288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్‌ హార్బర్‌ పనులు దాదాపు పూర్తికావడంతో ఇక్కడ ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, బోట్‌ బిల్డింగ్‌ యార్డ్‌లను ఏపీ మారిటైమ్‌ బోర్డు ఏర్పాటు చేస్తోంది. ఒక్క జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అంచనా. ఇలా వచ్చే 30 ఏళ్లలో ఈ హార్బర్‌ ద్వారా మిలియన్‌ టన్నుల మత్స్య సంపద లభిస్తుందని ఏపీ మారిటైమ్‌ బోర్డు అంచనా వేసింది. దీనికి అనుగుణంగా హార్బర్‌కు వెలుపల 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. వార్షిక ఆదాయంలో వాటా లేదా వార్షిక ప్రీమియం రూపంలో ఆదాయం పొందే పద్ధతిలో ఏపీ మారిటైమ్‌ బోర్డు ప్రతిపాదించింది. 30 ఏళ్ల కాలపరిమితి, ఆపైన పొడిగించుకునే విధంగా బిడ్లను ఆహ్వానించింది.

బోట్‌ తయారీ, మరమ్మతులు కూడా..
1,250 బోట్లు నిలుపుకునే విధంగా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 9ఎం ఎఫ్‌ఆర్‌పీ రకం బోట్లు 1,000, 12 ఎం గిల్‌ నెట్టర్‌ బోట్లు 100, 15ఎం ట్రావెలర్‌ 100 బోట్లు, 24ఎం టూనా లాంగ్‌ లైనర్‌ బోట్లు 50 నిలుపు­కు­నేలా హార్బర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే బోట్లు తయారీ, మరమ్మతుల యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ మారిటైమ్‌ బోర్డు ప్రతిపాదించింది. ఇందుకోసం 5 ఎకరాల్లో బోట్‌ బిల్డింగ్‌ యార్డ్‌ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. దీన్ని కూడా 30 ఏళ్ల కాలపరిమితికి లీజు రూపంలో ఇవ్వనుంది.

555 గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి
రాష్ట్రంలో మత్స్యకారులు చేపల వేట కోసం కుటుంబాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే అవసరం లేకుండా  సీఎం వైఎస్‌ జగన్‌ ఏకకాలంలో 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. వీటి ద్వారా రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. కేవలం ఫిషింగ్‌ హార్బర్లు కట్టి వదిలేయడమే కాకుండా పట్టిన చేపలకు మంచి విలువతో పాటు స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభించే విధంగా హార్బర్‌ ఆధారిత పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం.

ప్రతి ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, బోట్‌ బిల్డింగ్‌ యార్డ్‌లతో పాటు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె వద్ద ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తోపాటు బోట్‌ బిల్డింగ్‌ యార్డ్‌ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. ఈ హార్బర్‌ను నవంబర్‌లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే హార్బర్ల వద్ద పర్యాటకంగా ఉండే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం.
– ప్రవీణ్‌ కుమార్, సీఈవో, ఏపీ మారిటైమ్‌ బోర్డు, వీసీ–ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top