‘అమృత్ సరోవర్’లో ఏపీకి మూడో స్థానం

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత ఏపీనే టాప్
రాష్ట్రంలో 181 చెరువుల తవ్వకం పూర్తి
ఈ ఆగస్టు 15 నాటికి 20 శాతం చేయడం లక్ష్యం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ సరోవర్’ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి ఎగబాకింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 24న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో పది వేల క్యూబిక్ మీటర్ల మేర నీరు నిల్వ చేసేలా ఈ చెరువులు నిర్మించాలని నిర్ణయించింది.
నిర్దేశిత లక్ష్యం కన్నా ఎక్కువగా ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 2,890 చెరువుల నిర్మాణం, అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 1,809 చెరువుల పనులు కూడా మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఆగస్టుకు చెరువుల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది.
ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 399 చెరువుల నిర్మాణం పూర్తి చేస్తామని పంచాయతీరాజ్– గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్, శాంతిప్రియ పాండే తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. బుధవారం నాటికే 181 పూర్తి చేసి మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. మన కంటే ముందు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మాత్రమే ఉన్నాయి. ఈ కార్యక్రమం అమలు మొదలైన తొలి రోజుల్లో మన రాష్ట్రం దేశంలో 13వ స్థానంలో ఉండగా, తాజాగా మూడోస్థానానికి ఎగబాకింది. అమృత్ సరోవర్ కార్యక్రమంలో చెరువుల పూర్తికి గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆధ్వర్యంలో ప్రతి వారం ఈ అంశంపై కూడా శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తూ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటారని అధికారులు వెల్లడించారు. కాగా, నిర్మాణం పూర్తయిన చెరువుల వద్ద ఆగస్టు 15న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.