అమృత్ సరోవరం
కడప సిటీ : ఉపాధి హామీ పథకంలో చెరువుల అభివృద్ధి పనుల వల్ల రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రభుత్వం ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమృత్ సరోవర్ పేరిట ప్రతి జిల్లాలో 75 చెరువులు పూర్తి చేయాలన్నది సంకల్పం. ఇవన్నీ మార్చి 2023 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. కనీసం ఆగస్టు 15వ తేదీలోపు 20 చెరువుల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రధానంగా చెరువుకట్ట భద్రం చేయడం, కంప తొలగించడం, పూడికతీతీ పనులు చేపట్టాల్సి ఉంటుంది. చెరువుకట్టకు అవసరమైన మట్టి వేసిన తర్వాత మిగతా మట్టిని రైతులు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసుకుంటే ఉపాధి హామీ కూలీలే ఉచితంగా లోడింగ్ చేస్తారు. అంతేకాకుండా చెరువుల పరిసరాల్లో ఉన్న ఆయకట్టుకు నీరందుతుంది. దీంతో భూగర్బ జలాలు సమృద్ధిగా ఉంటాయి. చెరువుల్లో నీటి సామర్థ్యం పెరిగే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. ఆగస్టు 15న కనీసం 23 చెరువులు పూర్తి చేసి ఆ గ్రామానికి సంబంధించిన రైతులతో సర్పంచుతో కలిసి అధికారులు జాతీయ జెండాను చెరువుల వద్ద ఎగుర వేయాలన్నది నిర్ణయం.
‘ఉపాధి’లో 113 చెరువుల అభివృద్ది
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 113 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అనుమతులు కూడా రావడంతో మే నెల చివరిలో బి.మఠం మల్లేపల్లెలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కలెక్టర్, జేసీలు, కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అధికారులతోకలిసి ఇందుకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించారు. ఆరోజు నుంచి జిల్లాలో పనులు మొదలయ్యాయి.
నియోజకవర్గాల వారీగా...
ఈ పథకం కింద నియోజకవర్గాల వారీగా చెరువుల అభివృద్ధి పనులను పరిశీలిస్తే బద్వేలు నియోజకవర్గంలో 23, జమ్మలమడుగు 9, కమలాపురం 25, పులివెందుల 13, రాజంపేట 9, మైదుకూరు నియోజకవర్గంలో 13 చెరువులను బాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి కాకుండా అటవీశాఖ పరిధిలో మరో 17 చెరువులను అభివృద్ధి చేయనున్నారు.
కూలీలు ఎంతమంది?
పనులను కేవలం యంత్రాలతో కాకుండా కూలీలతోనే చేయాల్సి ఉంది. ఎవరికి కాంట్రాక్టు పనులు ఇచ్చేది ఉండదు. ఇందుకుగాను 3.18 లక్షల పనిదినాలు (కూలీలు) అవసరమవుతాయి. కూలీల వేతనాలకుగాను రూ. 8.18 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా చెరువుకట్ట భద్రం చేయడం, కంపచెట్లు తొలగించడం, పూడికతీత పనులు చేపడతారు.
రైతులకు మరిన్ని ప్రయోజనాలు
చెరువుల అభివృద్ధి వల్ల రైతులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. చెరువుల చుట్టుప్రక్కల దాదాపు 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. అంతేకాకుండా కూలీలు తీసిన మట్టిని రైతు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసుకుంటే ఉచితంగానే పొలాలకు తరలించే అవకాశం ఉంటుంది. అయితే గ్రామసభలో నిర్ణయించిన మేరకు రైతులకు ప్రాధాన్యత ఉంటుంది.
బృహత్తర పథకం
ఆజాదీ కా అమృత్ సరోవర్ అనే పథకం బృహత్తరమైంది. దీని వల్ల జిల్లాలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు అవకాశం వచ్చింది. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల పనులు ప్రారంభించాం. రైతులు కూలీలు తీసిన మట్టిని పొలాలకు ఉచితంగా తరలించుకునేందుకు అవకాశం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. నిర్ణయించిన గడువులోగా చెరువుల అభివృద్ధిని ప్రణాళిక మేరకు పూర్తి చేస్తాం.
– పి.యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప