ఇవాళే డీజీపీకి నివేదిక.. సిట్‌ పొడిగింపు? | Sakshi
Sakshi News home page

ఏపీ పోలింగ్‌ ఘటనలు: నేడు డీజీపీకి సిట్‌ నివేదిక.. లోతైన దర్యాప్తు కోసం పొడిగింపు కోరే ఛాన్స్‌!

Published Mon, May 20 2024 8:10 AM

AP Elections 2024 Incidents: SIT Report Submission To DGP Updates

విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) ఇవాళ్టితో ముగియనుంది. సోమవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు సిట్‌ ఇన్‌చార్జి.. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నివేదికను సమర్పించనున్నారు. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్‌ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

‘‘హింసాత్మక ఘటనలపై ఈసీకి ఇవాళ నివేదిక ఇస్తాం. నాలుగు జిల్లాల్లో టీమ్‌లు దర్యాప్తులో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లకు చెప్పి.. కొన్ని కేసుల్లో అదనపు సెక్షన్లు చేరుస్తాం. అలాగే కొంతమంది నిందితులను గుర్తించాం. నేటి నుంచి దర్యాప్తును పర్యవేక్షిస్తాం’’ అని సిట్‌ ఇన్‌చార్జి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఓ మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సిట్‌ ఇలా.. 
ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ సభ్యులు.. అలర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. పల్నాడులో అడిషనల్‌ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో రెండు బృందాలు, తిరుపతి చంద్రగిరిలో ఒక టీం, అనంతపురం తాడిపత్రిలో మరో టీం పర్యటించింది. డీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణ చేపట్టింది. అదే సమయంలో.. 

    వినీత్‌ బ్రిజ్‌లాల్‌, ఐజీ (సిట్‌ ఇన్‌ఛార్జి)

 • రమాదేవి, ఏసీబీ ఎస్పీ

 • సౌమ్యలత, ఏసీబీ అదనపు ఎస్పీ

 • రమణమూర్తి, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ

 • పి.శ్రీనివాసులు, సీఐడీ డీఎస్పీ 

 • వల్లూరి శ్రీనివాసరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ 

 • రవి మనోహరచారి, తిరుపతి ఏసీబీ డీఎస్పీ

 • వి.భూషణం, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌  (గుంటూరు రేంజ్‌)

 •  కె.వెంకటరావు, ఇన్‌స్పెక్టర్‌(ఇంటెలిజెన్స్‌), విశాఖపట్నం

 • రామకృష్ణ, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌

 • జీఐ శ్రీనివాస్, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌

 • మోయిన్, ఇన్‌స్పెక్టర్, ఒంగోలు పీటీసీ

 • ఎన్‌.ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్, అనంతపురం ఏసీబీ

 • శివప్రసాద్, ఇన్‌స్పెక్టర్, ఏసీబీ

సిట్‌ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటూ ఎప్పటికపుడు నాలుగు బృందాల నుంచి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిని మరో అదనపు ఎస్పీకి అప్పగించారు. 

మొత్తంగా.. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్‌లలో నమోదు అయిన 33 ఎఫ్‌ఐఆర్‌లను సిట్‌ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్‌ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్‌ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్‌ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్‌ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక​ క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. అదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లుసమాచారం. 

ఇక సిట్‌ బృందాలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. టీడీపీ శ్రేణులు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి, సిట్ బృందాలకి కూడా YSRCP ఫిర్యాదు చేసింది. 

ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
ఈసీ ఆదేశాలనుసారం సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్‌కు పూర్తి అధికారులు అప్పగించింది.  రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్‌ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్‌ ఇన్‌చార్జి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్‌ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement