మళ్లీ జగనే అవసరం | Sakshi
Sakshi News home page

మళ్లీ జగనే అవసరం

Published Sun, Apr 14 2024 5:43 AM

AP Editors Association Roundtable meeting in Visakhapatnam - Sakshi

ఆయన గెలిస్తే ఏపీ మరో సింగపూర్‌గా మారుతుంది 

ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరిగింది 

దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమం అందుతోంది 

ఏపీ ప్రభుత్వ పౌర సేవలు దేశానికే ఆదర్శం

అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన సీఎం జగన్‌ది 

బాబు హయాంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతమే 

‘జగన్‌ పాలన–ప్రవాసాంధ్రుల స్పందన’లో ఎన్‌ఆర్‌ఐలు 

విశాఖలో ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశం 

సాక్షి, విశాఖపట్నం: ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి జరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పౌర సేవలు దేశానికే ఆదర్శం. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందుతోంది. విద్య, వైద్య రంగాల్లో పశ్చిమ దేశాలకు దీటుగా ఏపీ అభివృద్ధి చెందింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ జగనే అవసరం.

ఆయన గెలిస్తే ఏపీ మరో సింగపూర్‌గా మారుతుంది’ అంటూ పలువురు ప్రవాసాంధ్రులు కొనియాడారు. ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘జగన్‌ పాలన – ప్రవాసాంధ్రుల స్పందన’ అనే అంశంపై శనివారం విశాఖలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 దేశాల నుంచి 50 మందికి పైగా ప్రవాసాంధ్రులు ప్రత్యక్షంగా, మరికొన్ని దేశాల నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమంపైప్రవాసాంధ్రులు రూపొందించిన అభివృద్ధి నివేదికను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు, వాటిలో మౌలిక సదుపాయాలు పశ్చిమ దేశాల్లో స్కూళ్లను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. విలువైన ట్యాబ్‌లు, అత్యుత్తమ సిలబస్‌ను ఆ దేశాల్లో ఏ ప్రభుత్వమూ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడంలేదన్నారు. ఏపీలో మాత్రం లక్షలాది విద్యార్థులు వీటిని ఉచితంగా పొందుతున్నారన్నారు. సుమారు కోటీ నలభై లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతున్నాయని, ఇలాంటి సదుపాయం అగ్రదేశం అమెరికాలో కూడా లేదని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా 12 కోట్ల పౌర సేవలు అందడం విశేషమని చెప్పారు.

ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు గణాంకాలతో సహా వివరించారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని, వీటి విలువ రూ.7.75 లక్షల కోట్లని చెప్పారు. నిరుద్యోగం 4.5 శాతానికి తగ్గిందని, కొత్త పరిశ్రమల ద్వారా గతేడాది 14 లక్షల పీఎఫ్‌ ఖాతాలు కొత్తగా చేరాయని, 18 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పెరిగారని తెలిపారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రవాసాంధ్రులు ఏమన్నారంటే.. 

ముందు చూపు ఉన్న నేత జగన్‌ 
విద్యారంగంలో వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంస్కరణలతో విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించే నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. నైపుణ్య వనరులుంటే పెట్టుబడులకు ముందుకు వస్తారు. అలాంటి వనరులను సీఎం జగన్‌ ఏపీలో సమకూర్చారు. ఇలాంటి ముందు చూపు అంబేడ్కర్‌కే సొంతం. మళ్లీ ఇప్పుడు జగన్‌లో అంబేడ్కర్‌ను చూస్తున్నా. రాష్ట్రంలో రూ.10 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టులతో పాటు ఐటీ కంపెనీలు, అమెరికాలో మాదిరిగా రూ.2 వేల కోట్ల విలువైన ఎంఎస్‌ఎంఈలు వస్తున్నాయి. తీరప్రాంతంలో కొత్తగా పోర్టులు, హార్బర్లు నిర్మిస్తున్నారు.      – శివ, టెక్సాస్‌  

స్వాతంత్య్రం వచ్చాక ఇంతలా అభివృద్ధి లేదు 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలోకి చాలా పరిశ్రమలు వస్తున్నాయి. నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా మారాయి. స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఇంతలా అభివృద్ధి జరగలేదు. వైఎస్‌ జగన్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఈ అభివృద్ధి కొనసాగుతుంది. ఈ బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది.   – వెంకట్‌ కల్లూరి, కాలిఫోర్నియా 

సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు 
వైద్య రంగంలో సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు.  వనరులు తక్కువ ఉన్నా కోవిడ్‌ సమయంలో సమర్థవంతంగా మరణాల సంఖ్యను బాగా తగ్గించగలిగారు. అగ్రదేశం అమెరికాలో సైతం ఇంతలా చేయలేకపోయారు. మరో పదేళ్లు వైఎస్‌ జగన్‌ సీఎంగా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది.   – డాక్టర్‌ పవన్‌ పాముకుర్తి, టెక్సాస్‌ 

మరే నాయకుడైనా ఇలా పాలించాడా? 
ఏపీలో నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. పేద విద్యార్థులను అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యకు దోహదపడుతున్నారు. మరే నాయకుడైనా ఇలా పరిపాలన చేశారా? ఏపీని ముందుకు తీసుకెళ్తున్న జగన్‌ను మరోసారి సీఎంగా ఎన్నుకోవాలి.   – కార్తీక్‌ ఎల్లాప్రగడ, నెదర్లాండ్స్‌ 

సామాజిక న్యాయం చేసి చూపారు 
సామాజిక న్యాయం నినాదం కాదు.. చేతల్లో చూపించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. అన్ని పార్టీలు ధనవంతులకే అవకాశాలు కల్పిస్తే.. జగన్‌ మాత్రం పేదలు, సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. బీసీ ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేశారు. బీసీ ముస్లింలకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికంటే మిన్నగా ఆయన తనయుడు జగన్‌ ఎన్నో మేళ్లు చేస్తున్నారు.    –ఇలియాస్, కువైట్‌ 

మహిళా సాధికారిత భేష్‌ 
ముఖ్యమంత్రి జగన్‌ మహిళా సాధికారితకు పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా అన్నింటా అవకాశాలు కల్పించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.  – పాలకుర్తి నీలిమ, యూఏఈ 

ప్రతి స్కూలూ స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీనే 
ఏపీ సీఎం జగన్‌ 40 వేల ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ స్కూళ్లలో పేద, ధనిక తేడా లేకుండా అందరూ వారి పిల్లల్ని చదివించుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాల స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగానే చెప్పవచ్చు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆయన్నే మరోసారి గెలిపించుకోవలసిన బాధ్యత అందరికీ ఉంది.   – కోటిరెడ్డి, సింగపూర్‌ 

అవినీతి గురించి విన్నామా? 
విద్యావంతులు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. గత టీడీపీ ప్రభు­త్వం హయాంలో స్కాంలు, ఆశ్రిత పక్షపాతం గురించే వినే వాళ్లం. ఈ ఐదేళ్లలో ఒక్క అవినీతి గురించైనా విన్నామా? వలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన అందుతోంది. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతు అవసరం. సీఎంగా మళ్లీ జగన్‌నే గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రజలకు ఉంది.     – వెంకట్‌ ఇక్కుర్తి, యూఎస్‌ 

సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తోంది 
ఏపీలో సంక్షేమం, అభివృద్ధి విశేషంగా జరిగింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 280 కొత్త కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు ఎంతో గొప్ప విషయం. కొత్తగా 4 లక్షల ఎంఎస్‌ఎంఈలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.      – వెంకట్‌ మేడపాటి, అమెరికా  

Advertisement
Advertisement