సాక్షి,అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను బుధవారం (నేడు) మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర విద్యశాఖ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలతో పాటు అభ్యర్థుల ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్‌లో 1,82,317 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 63,546 మంది క్వాలిఫై అయ్యారు.
ఏపీ ఎప్‌సెట్ పలితాలను జేఎన్టీయూ వీసీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ లో 71.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌లో తొలి ర్యాంక్ గుంటూరుకు చెందిన రోషన్ మణి దీప్ రెడ్డి( 95.69),శ్రీ కాకుకుళానికి చెందిన శ్రావ్య (95.59)కు రెండో ర్యాంక్ దక్కింది. ఇంజనీరింగ్‌లో టాప్ 10 మందిలో 9 మంది అబ్బాయిలే ఉన్నాయి.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో మొదటి ర్యాంక్ విజయనగరానికి చెందిన జశ్వంత్ నాయుడు(92.53),రెండో ర్యాంక్ హైదరాబాద్ కి చెందిన వెంకట్ రెడ్డి(91.84) ఉన్నారు. టాప్ 10లో ఐదుగురు అమ్మాయిలు,ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. అగ్రికల్చర్ లో 89.59 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జేఎన్‌టీయూ వీసీ ప్రసాద్ తెలిపారు.
అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, డేటాఫ్‌బర్త్ , క్యాప్చా కోడ్ నమోదు చేసి చూసుకోవచ్చు. స్కోర్‌కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు, కేటగిరీ, సబ్జెక్టులవారీగా మార్కులు, మొత్తం మార్కులు వంటి సమాచారం ఉంటుంది. స్కోర్‌కార్డులో ఏవైనా పొరపాట్లు కనిపిస్తే వెంటనే APSCHE అధికారులను సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ ఈ ఏడాది ఏపీఎప్‌సెట్ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు మే 12 నుంచి మే 20, 2026 వరకు వివిధ కేంద్రాల్లో జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.


