పెద్దలు కాదు, పాపం.. విధి ఆ ప్రేమజంటను విడదీసింది

AP Crime News: Eloped Couple Met Accident At Tenali Lover Died - Sakshi

ఒకేచోట పని చేసే ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో చెబితే పెద్దలు కాదన్నారు. వీళ్లు ఎదురించారు. ఇంట్లోంచి వెళ్లిపోయి కలిసి బతకాలనుకున్నారు. కానీ, విధి ఈ లవ్‌స్టోరీని విచిత్రమైన మలుపు తిప్పింది. విషాదాంతమైన ముగింపు ఇచ్చింది.

హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): బాపులపాడు మండలం వీరవల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ప్రేమజంట రోడ్డు ప్రమాదానికి గురైంది. 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైంది. 

పోలీసుల కథనం మేరకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెరువూరుకు చెందిన సారపు పోతురాజు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మెర్సీ కొంతకాలంగా ఓ స్పిన్నింగ్‌ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ తమ పెద్దలకు చెప్పగా వారు అంగీకరించలేదు. ఈ నెల 19వ తేదీన మెర్సీకి వేరే యువకుడితో వివాహం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 18వ తేదీనే మెర్సీ, పోతురాజు తమ ఇళ్ల నుంచి పరారయ్యారు. 

దీంతో.. మెర్సీ అదృశ్యమైందని ఆమె తల్లిదండ్రులు తెనాలి టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెర్సీ, పోతురాజుతో కలిసి అతని స్వగ్రామమైన రంపచోడవరం మండలం చెరువూరులో ఉన్నట్లుగా గుర్తించారు. విచారణ నిమిత్తం తెనాలి టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా ప్రేమికులకు పోలీసులు సూచించారు. దీంతో పోతురాజు, మెర్సీ బైక్‌పై తెనాలి బయలుదేరారు. వీరవల్లి సమీపంలో జాతీయ రహదారి ప్లై ఓవర్‌ బ్రిడ్జి మీదకు రాగానే పోతురాజు సెల్‌ఫోన్‌ మోగింది. అతను బైక్‌ నడుపుతూనే ఫోన్‌ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. బైక్‌ అదుపుతప్పి వంతెన సైడ్‌ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. 

ప్రేమికులు ఇద్దరూ ఎగిరి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో పోతురాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మెర్సీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వీరవల్లి ఏఎస్‌ఐ వై.ఆంజనేయులు, హైవే రోడ్‌ సేఫ్టీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మెర్సీని హుటాహుటిన  విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

నోట్‌: వాహనాలు నడిపేటప్పుడు ఫోన్‌ కాల్‌ మాట్లాడడం మంచిది కాదు. నిర్లక్ష్యంగా చేసే ఈ పని.. జీవితాలను తలకిందులు చేసే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top