సీఎం జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

Published Sun, Jan 14 2024 4:18 AM

AP CM YS Jagan Makar Sankranti 2024 Wishes To Telugu People - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగని.. గ్రామానికి నూతన శోభను తెచ్చే పర్వదినమని.. మన సంస్కృతి, సంప్ర­దా­యాలను ప్రతిబింబించే రోజని ఆయన అన్నారు. అంతేకాక, పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ, ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువ­ఇచ్చే పెద్ద పండుగని ముఖ్యమంత్రి జగన్‌ అభివర్ణించారు.

భోగి మంటలు.. రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు, రైతు లోగిళ్లలో ధాన్యం రాశులు, పిండి వంటల ఘుమఘుమలు, బంధు­మిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.

పల్లెలన్నీ మళ్లీ కళకళ..
ఇక మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, ప్రభుత్వ బడి, ప్రభుత్వాసుపత్రిలో నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు,  బ్రాడ్‌బాండ్‌ సదుపా­యంతో డిజిటల్‌ లైబ్రరీలు, ఒక్క రూపాయి లంచం, వివక్ష లేకుండా ప్రజలకు రూ.2.46 లక్షల కోట్ల డీబీటీ.. ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి.. ఇలా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పల్లెలు మళ్లీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జగన్‌ తెలిపారు.

అలాగే.. ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ.. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలమన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వమిదని ఆయన పేర్కొంటూ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement