AP: ఏప్రిల్‌ 2 వరకు ఓటీఎస్‌ పథకం పొడిగింపు

AP CM YS Jagan Announced OTS Scheme Will Be Extended Till April 2 - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఏప్రిల్‌ 2 వరకు ఓటీఎస్‌ పథకం పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పేదల ఇళ్లపై ఉన్న అప్పులను, వడ్డీని మాఫీచేసి, సర్వ హక్కులతో వారికి రిజిస్ట్రేషన్‌ చేయించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మంగళవారం నుంచి రాష్ట్రంలో ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా రిజిస్ట్రేషన్‌ పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన 8.26 లక్షల మందికి కూడా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్‌ పట్టాలను అందజేయనున్నారు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా అందే ప్రయోజనాలివే.. 
ఇంటిపై సర్వ హక్కులు: గతంలో ఉన్న ‘నివసించే హక్కు’ స్థానంలో నేడు లబ్ధిదారునికి తన ఇంటిపై సర్వహక్కులు రానున్నాయి.
లావాదేవీలు సులభతరం: ఇంటిపై పూర్తి హక్కును పొందడం ద్వారా లబ్ధిదారుడు సదరు ఇంటిని అమ్ముకోవచ్చు.. బహుమతిగా ఇవ్వవచ్చు.. వారసత్వంగా అందించవచ్చు.. అవసరమైతే తనఖా పెట్టి బ్యాంకుల నుండి రుణం కూడా పొందవచ్చు. 
రూ.16 వేల కోట్ల లబ్ధి: దాదాపు 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల రుణమాఫీ, మరో రూ.6 వేల కోట్ల మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్‌ ఫీజుల మినహాయింపుతో మొత్తం రూ.16,000 కోట్ల లబ్ధి కలగనుంది. 


నామమాత్రపు రుసుము: 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి, ఇళ్ల నిర్మాణాలకు రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. అసలు, వడ్డీ ఎంత ఎక్కువ ఉన్నా గ్రామాల్లో కేవలం రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తం మాఫీ. చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తంపై రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే రిజిస్ట్రేషన్‌ చార్జీలన్నీ కూడా పూర్తిగా మాఫీచేస్తూ పూర్తి హక్కులు కల్పించనున్నారు. 
ఇంటిపై సర్వహక్కులు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఇంటి మీద పూర్తి హక్కులులేని దాదాపు 12 లక్షల మందికి కేవలం రూ.10కే సర్వహక్కులతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తోంది. 
22–ఏ నుండి తొలగింపు: లబ్ధిదారుడి స్థిరాస్తిని గతంలో ఉన్న నిషేధిత భూముల జాబితా (22–ఏ నిబంధన) నుండి తొలగిస్తున్నారు. దీంతో లబ్ధిదారుడు తన ఇంటిపై ఎలాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు. 
 రిజిస్ట్రేషన్‌ ఇక సులభతరం: లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తిని గ్రామ–వార్డు సచివాలయంలోనే రిజిస్టర్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరంలేదు.  
 లింకు డాక్యుమెంట్లతో పనిలేదు: ఈ పథకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏ విధమైన లింకు డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top