ఓవైపు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్న బాబు సర్కార్
మరోవైపు రాష్ట్ర ఖజానా నుంచి రూ.వందల కోట్ల నిధులను దోచిపెట్టే కుతంత్రం
గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులు రెండేళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తుల హస్తగతం..
అందులో పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలను సైతం ప్రభుత్వమే చెల్లించనుంది
ఇప్పటికే ప్రైవేట్‌కు పది మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టిన చంద్రబాబు ప్రభుత్వం
ఇప్పుడు ఇక ఆస్పత్రుల వంతు.. మెడికల్ కాలేజీల్లోని మిగులు భూముల్లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చు
ఇప్పటికే ఇచ్చినవి చాలదన్నట్లు ప్రైవేటు వ్యక్తులకు బాబు సర్కారు మరో బంపర్ ఆఫర్
పీపీపీ వైద్య కళాశాలల ఆర్‌ఎఫ్‌పీకి సవరణలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ
నిన్న...
ప్రభుత్వ భూమిలో... ప్రభుత్వ డబ్బుతో... వైఎస్సార్‌సీపీ సర్కారులో వైఎస్ జగన్ నిరి్మంచిన వైద్య కళాశాలలను పప్పుబెల్లాల తరహాలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. తద్వారా మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను చిదిమేసింది. మనకు రావాల్సిన మెడికల్ సీట్లను కూడా పోగొట్టింది. పేదలకు ఉచితంగా అందాల్సిన మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేసింది.
నేడు..
చంద్రబాబు సర్కారు మరింత బరితెగించింది. ప్రభుత్వ డబ్బులతో నిరి్మంచిన నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పబోతోంది. కొసమెరుపు ఏంటంటే... ఇప్పటికే ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు గంపగుత్తగా ఆస్పత్రిని ప్రైవేటుకు అప్పజెప్పడమే కాకుండా.. ఈ రెండేళ్లు పాటు అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అందరికీ ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందట. అంటే... ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టి, ప్రభుత్వ ఆస్పత్రిని, దానిలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతోంది. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమూ చేయని రీతిలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది.
సాక్షి, అమరావతి: సంపద సృష్టి హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు... పచ్చపార్టీ కార్పొరేట్‌లు, అస్మదీయులు, బంధుమిత్రులకు ప్రజా సంపదను దోచిపెట్టడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ)ను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి పప్పుబెల్లాల్లా కట్టబెడుతున్నారు. భూమి ప్రభుత్వానిది, మెడికల్ కాలేజీ ప్రభుత్వానిది, ఆస్పత్రులు ప్రభుత్వానివి, అక్కడ పనిచేసే వైద్య సిబ్బందిని హోల్‌సేల్‌గా ప్రైవేటుకు అప్పజెప్పడమే కాక రెండేళ్ల పాటు వారి జీతాలను ప్రభుత్వమే చెల్లించడానికి సిద్ధమైంది. తద్వారా జీతభత్యాల రూపేణానే వందల కోట్ల రూపాయిలను అప్పనంగా ప్రైవేటు వారికి దోచిపెడుతోంది.
జగన్ శ్రీకారం.. చంద్రబాబు బేరం
వైఎస్ జగన్ రూ.8,480 కోట్లతో కొత్తగా 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టగా గత ప్రభుత్వంలోనే ఐదు కళాశాలలు ప్రారంభమై తరగతులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు 10 వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్‌కు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలను కైవసం చేసుకునే ప్రైవేట్‌కు ధారాదత్తం చేసింది. ఇది చాలదన్నట్లు వాళ్లకు ప్రభుత్వ ఆస్పత్రులను రెండేళ్ల పాటు అప్పగించనుంది. వాటిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏకంగా రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అధికారికంగా దోచిపెడుతోంది.
ఆర్‌ఎఫ్‌పీకి సవరణలు చేస్తూ ఉత్తర్వులు
ఇప్పటికే రూ.కోట్ల విలువైన భూములను ఎకరానికి రూ.వంద లీజు, వైద్య సేవలకు రుసుములు, ప్రైవేట్ కళాశాలల మాదిరి వైద్య విద్యార్థుల నుంచి ఫీజు వసూలుతో ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు తలపెట్టడానికి బాబు సర్కారు సిద్ధమైంది. ఇదికూడా సరిపోనట్లుగా ప్రైవేట్ వ్యక్తులకు మరింత లబ్ధి చేకూరుస్తూ ఖజానా నుంచి ఏకంగా రూ.వందల కోట్లపైనే ప్రయోజనం చేకూర్చే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)కు సవరణలు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అత్యాధునిక పరికరాలు, పోస్టులు భర్తీ చేసిన జగన్ సర్కారు..
తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు ఇస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్లు పిలిచింది. వీటిలో పులివెందుల వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. మిగతా మూడుచోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను 300 పైగా పడకల ఆస్పత్రులుగా అభివృద్ధి చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యులు, బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. పులివెందుల కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులను ప్రారంభించడానికి ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు కూడా వచ్చాయి.

కానీ, బాబు సర్కారు కళాశాలకు సీట్లు వద్దని లేఖ రాసి రద్దు చేయించింది. దీన్నిబట్టి పరిశీలిస్తే ప్లగ్ అండ్ ప్లే తరహాలో నాలుగు కళాశాలలు ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఒక కొత్త వైద్య కళాశాలను స్థాపించాలంటే 25 ఎకరాల భూమి సమకూర్చుకోవాలి. కనీసం 320 పడకల బోధనాస్పత్రిని అభివృద్ధి చేశాక... ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసి ఓపీ, ఐపీ, సర్జరీలు, ఇతర సేవల్లో నిర్దేశించిన ప్రమాణాలను అధిగమించాకే నెలకొల్పే అర్హత వస్తుంది. ఇది ఎంతో ఖర్చు, ప్రయాసలతో కూడినది. దీనంతటికీ రూ.వందల కోట్ల పెట్టుబడి పెట్టి, సుమారు ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వ్యయ ప్రయాసలేమీ లేకుండా తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలను బాబు సర్కార్ ప్రైవేట్‌కు ఇచ్చేసింది. దాంతో ఆగకుండా మరింత బరితెగించి ఆస్పత్రులను ఇచ్చేసి, అక్కడి పనిచేసే వైద్య సిబ్బందికి జీతాలను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడానికి సిద్ధమైంది.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 800 మంది వైద్య సిబ్బంది
నాలుగు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 800 మంది మేర వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. టెండర్లలో కళాశాలలను కైవసం చేసుకున్న ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆస్పత్రులు పెట్టి, వైద్యులు, సిబ్బంది వేతనాలను ప్రభుత్వమే చెల్లించబోతోంది. అంటే, రూ.వందల కోట్లపైగా ప్రజాధనాన్ని జీతాల రూపంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు చేయబోతోంది.
గోరంత ప్రభుత్వానికి ఇస్తే చాలు
భవిష్యత్‌లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ వంటి అనుబంధ వైద్య విద్య కళాశాలలు మిగులు భూముల్లో ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం అవకాశం ఇచి్చంది. ప్రతిఫలంగా వచ్చే ఆదాయం నుంచి ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి 3 శాతం ఇవ్వాలని ఆఫర్ ఇచ్చారు. వాస్తవానికి తొలుత మెడికల్, నర్సింగ్, అనంతరం డెంటల్, ఆయుష్ వంటి ఇతర కళాశాలలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడానికి వీలుగా వైఎస్ జగన్ హయాంలో కళాశాలలకు భూములను కేటాయించారు.

ఇప్పుడా భూములన్నింటినీ నామమాత్రం లీజు ధరలతో ప్రైవేట్‌కు కట్టబెట్టేయడమే కాకుండా అనుబంధ కళాశాలలు ఏర్పాటు చేసుకుని లాభాలు గడించడానికి బాబు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. పీపీపీలో వైద్య కళాశాలల అభివృద్ధిలో ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులపై ఎలాటి భారం ఉండదంటూ చంద్రబాబు, మంత్రులు తేనె పూసిన కత్తిలాంటి ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులకు నష్టం తలపెడుతూ ప్రైవేట్ వ్యక్తులకు లాభాల పంట పండించేలా పీపీపీ విధానం రూపొందించారు. ఈ కళాశాలల్లో... మిగతా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజులు ఉంటాయని సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించింది.
కోటి సంతకాలతో కలమెత్తి..!
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునకు అపూర్వ స్పందన
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ
ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థుల నుంచి స్వచ్ఛందంగా మద్దతు
మేధావులు, తల్లిదండ్రులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంతకాలు
ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ, వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచి్చన కోటి సంతకాల సేకరణ పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. రూ.లక్షల కోట్ల విలువైన సంపద లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన సన్నిహితులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టడంపై వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.
పేదలు వైద్యం కోసం వెళ్లిన క్రమంలో ప్రైవేటు దోపిడీకి బలికాకుండా అరికట్టి సేవలందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు స్వచ్ఛందంగా మద్దతు పలికి పెద్దఎత్తున పాల్గొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ర్యాలీల్లో ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేశారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలంటూ చంద్రబాబు సర్కార్‌పై సమరభేరి మోగించారు.
మరోవైపు కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పరాకాష్టకు చేరిన చంద్రబాబు సర్కారు అవినీతికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీలతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతో పాటు మన విద్యార్థులకు కనీ్వనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు కాలదన్నడాన్ని వివరించింది. కాగా, కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాల సేకరణలో భాగమయ్యారు.
ఇది ఒక మహోద్యమంగా రూపాంతరం చెందడంతో బాబు ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి దిగింది. నిరసన ర్యాలీల్లో పాల్గొనొద్దని, కేసులు పెడతామని వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసుల చేత నోటీసులిప్పించింది. అయినా నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు గళం విప్పాయి.


