
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రయోజనాలు భారీగా పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర బార్ కౌన్సిల్ (న్యాయవాద మండలి), తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కీలక నిర్ణయాలు ఇలా..
⇒ మరణించిన న్యాయవాదుల నామినీలకు ప్రస్తుతం ఇస్తున్న మరణ ప్రయోజనం రూ. 3 లక్షలు పెరిగింది. దీనితో ఈ మొత్తం రూ.ఆరు లక్షల నుంచి రూ. తొమ్మిది లక్షలకు చేరింది.
⇒ అనారోగ్యంతో బాధపడే న్యాయవాదులు, వారి భార్యలకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.1.50 లక్షలు.
⇒ కాగా, ద్వారకనాథరెడ్డి నేతృత్వంలో జరిగిన న్యాయవాదుల క్లర్కుల సంక్షేమ నిధి కమిటీ సమావేశం మరణించిన న్యాయవాదుల క్లర్కు నామినీకి ప్రస్తుతం అందచేస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.4.50 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ. 4 లక్షలు.
⇒ అనారోగ్యం బారిన పడిన క్లర్కులకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం రూ. 80 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది.
సంక్షేమానికి కౌన్సిల్ పెద్దపీట
న్యాయవాదుల సంక్షేమానికి కౌన్సిల్ పెద్దపీట వేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న (85 మందికి రూ.74.20 లక్షలు), వృత్తి నుంచి వైదొలగిన న్యాయవాదులకు (ముగ్గురికి రూ.9 లక్షలు) మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు (52 మందికి రూ.2.86కోట్లు) బార్ కౌన్సిల్ మొత్తంగా రూ.3.69 కోట్ల ఆర్థికసాయం చేసింది. దీనికి అదనంగా న్యాయవాదులందరి సంక్షేమం కోసం కౌన్సిల్ రూ.20.50 లక్షల మేర ఆర్థిక సాయం అందజేసింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ న్యాయవాది కుటుంబానికి రూ.5 లక్షలను న్యాయవాద మండలి నిధుల నుంచి చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్‌గా అందుతోంది.
ఐలూ హర్షం
రాష్ట్ర బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలపై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు బార్ కౌన్సిల్‌కు ఐలూ రాష్ట్ర అధ్యక్షుడు కె.కుమార్, ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ మొత్తాన్నీ రూ.9 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమం
దేశంలో ఏ బార్ కౌన్సిల్ కూడా ఇంత పెద్ద మొత్తంలో న్యాయవాదులకు, వారి క్లర్కులకు ఆర్థిక సాయం అందించడం లేదు. న్యాయవాదుల సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. – ఎన్.ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్