‘అగ్రి గోల్డ్‌’ చెల్లింపులకు అనుమతించండి

AP AG appeals to Telangana High Court On Agri Gold Issue - Sakshi

ఏపీ ప్రభుత్వం రూ.1,150 కోట్లు కేటాయించింది

తెలంగాణ హైకోర్టుకు ఏపీ ఏజీ విజ్ఞప్తి

9న విచారించేందుకు హైకోర్టు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: అగ్రి గోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేసి నష్టపోయిన వారికి న్యాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019–20 బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించిందని, ఈ డబ్బు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ తెలంగాణ హైకోర్టును అభ్యర్థించారు. అగ్రి గోల్డ్‌ డిపాజిటర్లకు న్యాయం చేయాలని, అగ్రి గోల్డ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 2015లో ఉమ్మడి హైకోర్టు ఉన్న సమయంలో డిపాజిటర్స్, ఏజెంట్స్‌ అసోసియేషన్‌ తరఫున ఆండాల్‌ రమేష్‌బాబు ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ పిల్‌లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతివాదులుగా ఉన్న నేపథ్యంలో ఈ కేసును విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంది.

ఈ నేపథ్యంలో.. డబ్బు పంపిణీకి అనుమతి ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ చల్లా కోదండరామ్‌లతో కూడిన ధర్మాసనాన్ని శ్రీరామ్‌ బుధవారం అభ్యర్థించారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం డిపాజిటర్లను గుర్తించి డబ్బు పంపిణీ చేస్తామని, మానవీయ కోణంలో ఆలోచించి డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని తెలిపారు. డబ్బు పంపిణీకి అనుమతి కోరుతూ గత ఏడాది డిసెంబర్‌లో తాము రెండు పిటిషన్లు దాఖలు చేశామని, ప్రభుత్వమే డిపాజిటర్లను ఆదుకునేందుకు డబ్బు చెల్లిస్తున్న నేపథ్యంలో అనుమతించాలని కోరారు. తాము దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను విచారించాలని బాధితుల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఈనెల 9న ఈ పిటిషన్లను విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది.

హామీ నిలబెట్టుకున్న సీఎం జగన్‌
ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అగ్రి గోల్డ్‌ డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్‌ జగన్‌ తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 2019–20 బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించారు. రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి చెల్లించేందుకు రూ.263.99 కోట్లు విడుదల చేయడంతోపాటు 94 శాతం మందికి చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి సైతం డబ్బు చెల్లించేందుకు వీలుగా హైకోర్టు అనుమతి తీసుకుని చెల్లింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్రి గోల్డ్‌ సంస్థ 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు సేకరించి మోసం చేసింది. బాధితులకు ఏపీ ప్రభుత్వం ముందుగానే చెల్లింపులు చేసి.. హైకోర్టు నియమించిన జిల్లా స్థాయి కమిటీల ఆధ్వర్యంలో అగ్రి గోల్డ్‌ ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ప్రభుత్వం తిరిగి తీసుకునేలా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top