కాల్‌ హిస్టరీ ఆధారంగా నూతన్‌ మోసాలపై దర్యాప్తు

Another Case Filed On Nutan Naidu In Gajuwaka Police Station - Sakshi

చెప్పేది ఒక్కటి చేసేది మరొకటి 

మాజీ ఐఏఎస్‌ పి.వి.రమేష్‌ పేరుతో 

30 మందికి పైగా అధికారులతో పైరవీలు

నూతన్‌ నాయుడుపై గాజువాక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

సాక్షి, విశాఖపట్నం : కొందరు చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లు ఉంటారు. దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో అరెస్ట అయిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని, బిగ్‌బాస్‌ ఫేమ్, సినీ దర్శకుడు నూతన్ ‌నాయుడి తీరు అలానే ఉంది. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్‌లో ఆయన ఇంటి చుట్టు పక్కల నీతి వాక్యాలతో కూడిన ప్లెక్సీలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘కోపం.. అసూయ.. అబద్ధాలు.. మోసం.. ఇలాంటి వ్యవహారాలు చేస్తే జీవితం మొత్తం పతనమవుతుంది’ అంటూ ఫ్లెక్సీలు కనిపిస్తాయి. కలశ ఫౌండేషన్‌ పేరిట తన ఇంటి చుట్టూ ఆశ్యర్యపరిచేలా ఫ్లెక్సీలుంటున్నాయి. కానీ ఆయన చేసే మోసాలు లెక్క కట్టలేని విధంగా ఉన్నాయి. దళిత యువకుడు శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో అరెస్ట్‌ అయిన 24 గంటల్లోనే గాజువాక పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.

మాజీ ఐఏఎస్‌ అధికారి పి.వి.రమేష్‌ పేరిట సుమారు 30 మందికి పైగా అధికారులకు ఫోన్లు చేసి పైరవీలకు పాల్పడిన నూతన్‌ నాయుడు మోసాలు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌కి చేసిన ఫోన్‌తో బట్టబయలైన విషయం తెలిసిందే. ఒకవైపు శ్రీకాంత్‌కు శిరోముండనం సంఘటనలో నూతన్‌ నాయుడు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా స్పష్టం చేయగా... మరోవైపు  మాజీ ఐఏఎస్‌ అధికారి పి.వి.రమేష్‌ పేరిట పైరవీలకు పాల్పడిన కేసులను పోలీసులు ఒక్కోకటి దర్యాప్తు చేస్తూ బయటపెడుతున్నారు.

గాజువాక సీఐకి నూతన్ ‌నాయుడు ఫోన్‌ 
గతంలో గాజువాక పోలీస్‌స్టేషన్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఓ వ్యక్తి అరెస్ట్‌ అయ్యారు. నూతన్‌నాయుడు తాను మాజీ ఐఏఎస్‌ అధికారినని అరెస్టయిన వ్యక్తిని వదిలేయమని గాజువాక సీఐకి ఫోన్‌ చేశాడు. అతడు ట్రాఫిక్‌ సీఐకి కాల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయగా.. అది సీఎంఓ ఆఫీస్‌ నెంబర్‌ కాదనేసరికి ఫోన్‌ కట్‌చేసేశారు. ఈ కేసులో కూడా నూతన్‌ నాయుడిపై కేసు నమోదు చేశారు. అలాగే శ్రీదేవి కేబుల్‌ టీవీలో షేర్స్‌ కావాలని.. ఆ సంస్థ ఉద్యోగికి ఫోన్‌ చేశాడు. మిగతా కాల్స్‌ను కూడా ఒక్కొక్కటి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖకి నూతన్‌ నాయుడు 
కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి నూతన్‌నాయుడిని అరెస్ట్‌ చేసి శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. శనివారం విశాఖకు బయలుదేరారు. ఆదివారం ఉదయానికి నూతన్‌నాయుడుని విశాఖకు తీసుకురానున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top