మరో 287 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం

Another 287 acres of cannabis plantations were destroyed In AP - Sakshi

విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న పోలీసు, ఎస్‌ఈబీ బృందాల దాడులు

పాడేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్‌ఈబీ బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్‌ఈబీ జేడీ ఎస్‌.సతీష్‌కుమార్‌ల ఆదేశాల మేరకు మంగళవారం జరిపిన దాడుల్లో ఏజెన్సీలోని జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలో మొత్తం 287 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ గచ్చుపల్లి పరిసర ప్రాంతాల్లో 77 ఎకరాలు, జి.కె.వీధి మండలంలోని గొందిపల్లి, పి.కొత్తూరు, సిల్లిగూడ గ్రామ సమీపంలోని 18 ఎకరాలు, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని కె.పెదబయలు గ్రామ పరిసరాల్లో 40 ఎకరాల్లో గంజాయి పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే పెదబయలు మండలంలోని గుల్లెలు, గోమంగి పంచాయతీల్లోని చావిడిమామిడి, గుల్లెలు, దల్లెలు గ్రామాల్లో 152 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలన్నింటినీ నరికి నిప్పటించారు. 

కళాజాత ద్వారా ప్రచారం 
హుకుంపేట మండలంలోని కొట్నాపల్లి, చీడిపుట్టు, దాలిగుమ్మడి గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా గంజాయి వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు. గంజాయి సాగు, రవాణా ద్వారా గిరిజన ప్రాంతాలకు జరుగుతున్న అనర్ధాలు, జైలు జీవితంతో దుర్భర బతుకులు, తదితర అంశాలపై పాటలు, నృత్య రూపకాల ద్వారా 
అవగాహన కల్పించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top