Andhra Pradesh: టెలీమెడిసిన్‌లో అగ్రగామి ఏపీ | Andhra Pradesh Tops In telemedicine | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: టెలీమెడిసిన్‌లో అగ్రగామి ఏపీ

Published Mon, Feb 20 2023 4:26 AM | Last Updated on Mon, Feb 20 2023 9:58 AM

Andhra Pradesh Tops In telemedicine - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మారుమూల గ్రామంలోనూ అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి వెనువెంటనే నాణ్యమైన వైద్య సేవలందించాలన్నది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం టెలీమెడిసిన్‌ విధానాన్ని బలోపేతం చేశారు. ఈ–సంజీవని టెలీమెడిసిన్‌ ద్వారా స్పెషలిస్టు వైద్య సేవలు అందిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ చర్యలతో టెలీమెడిసిన్‌ సేవల్లో రాష్ట్రం రికార్డు సృష్టించింది.

దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. టెలీమెడిసిన్‌ సేవల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరుకి దేశవ్యాప్తంగా 6.03 కోట్ల మంది రోగులకు టెలీమెడిసిన్‌ సేవలందిస్తే.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 1.86 కోట్ల మంది రోగులకు ఈ సేవలందినట్లు ఆ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్‌లో తెలిపింది.

అంటే దేశం మొత్తం అందించిన టెలీమెడిసిన్‌ సేవల్లో 30.84 శాతం ఒక్క ఏపీలోనే అందించినట్లు. పశ్చిమబెంగాల్‌లో 86.69 లక్షల మందికి, తమిళనాడులో 67.22 లక్షల మందికి ఈ సేవలందించినట్లు పేర్కొంది. 

అత్యున్నతం.. ఏపీ టెలీమెడిసిన్‌ 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో టెలీమెడిసిన్‌ విధానాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దింది. దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. ఈ–సంజీవని టెలీమెడిసిన్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోగులకు స్పెషలిస్టు సేవలు అందుతున్నాయి.  హబ్, స్పోక్‌ మోడల్‌ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లకు టెలీమెడిసిన్‌ సేవలను అందిస్తున్నారు.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక హబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య హెల్త్‌ క్లినిక్స్, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉన్నారు.

పీహెచ్‌సీలకు, విలేజ్‌ క్లినిక్స్‌కు వచ్చిన  రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలీమెడిసిన్‌ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. వైద్యులు ఆడియో, వీడియో కాల్‌లో రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. ఏ మందులు వాడాలో కూడా సూచిస్తారు.

వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు, మరో వైపు స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారు ఈ –సంజీవని (ఓపీడీ)యాప్‌ ద్వారా ఇంటి నుంచే  వైద్య సేవలను పొందుతున్నారు.

స్మార్ట్‌ ఫోన్‌ లేని వారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ–సంజీవని ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ సేవలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 42వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేసింది. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలీమెడిసిన్‌ ద్వారా స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలను పొందుతున్నారు. 

ప్రసూతి వేళ అందిన సేవలు మరువలేనివి 
నాకు ప్రసూతి వేళలో టెలీమెడిసిన్‌ విధానంలో అందిన సేవలు మరువలేనివి. స్థానిక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లో ఎంఎల్‌హెచ్‌పీ సింగంపల్లి సంధ్య ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. ఆమె నేరుగా వీడియోకాల్‌ ద్వారా గైనకాలజిస్టును అనుసంధా­నం చేసేవారు. గైనకాలజిస్టు నిండిన నెలల ఆధారంగా నాకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు సూచిం­చేవారు.

తీసుకోవలసిన ఆహారం, వేసుకోవలసిన మందులు చెప్పేవారు. పరీక్షల కోసం ఎంఎల్‌హెచ్‌పీ స్థానిక పీహె­చ్‌సీకి తీసుకువెళ్ళేవారు. టెలీమెడిసిన్‌ సహకారంతో డిసెంబర్‌లో పండంటి ఆడ శిశువును కన్నాను. మాది మధ్య తరగతి కుటుంబం. కార్పొరేట్‌ వైద్యాన్ని భరించే స్థోమత లేదు. టెలీమెడిసిన్‌ ద్వారా అంతకుమించిన నాణ్య­మైన వైద్యాన్ని అందుకున్నాను. ఈ సేవలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
–కుడుపూడి నాగశ్రీ, ఇంద్రపాలెం, కాకినాడ రూరల్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement