ఎయిమ్స్‌లోనూ ఇక ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవలు

Andhra Pradesh Signs MoU with AIIMS to Provide Aarogyasri Services - Sakshi

24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చర్యలు

అవగాహన ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం

అతి త్వరలో పెట్‌ సిటీ స్కాన్‌ ప్రారంభం

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రజిని వెల్లడి  

సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇకపై ఎయిమ్స్‌లో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలందనున్నాయి. ఈ మేరకు గురువారం మంగళగిరిలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఎయిమ్స్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే సీఎం జగన్‌ ఆలోచనల మేరకు ఎయిమ్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. 


కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 100 మందికి పైగా రోగులకు ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించామన్నారు. 30 మందికి పైగా రోగులకు చికిత్సలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ట్రయల్‌ రన్‌ పూర్తవ్వడంతో అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. 24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలందేలా చర్యలు తీసుకున్నామన్నారు. 

క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యం 
అతి త్వరలో ఎయిమ్స్‌లో పెట్‌ సిటీ స్కాన్‌ అందుబాటులోకి రానుందని మంత్రి విడదల రజిని చెప్పారు. శరీరంలో ఎక్కడ క్యాన్సర్‌ అవశేషాలున్నా సరే.. ఈ స్కాన్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఏపీలోనే అందించాలనే సీఎం జగన్‌ ఆలోచనకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌కు ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు. వచ్చే జూన్‌ కల్లా పైపులైను పనులు పూర్తవుతాయని చెప్పారు. ఎయిమ్స్‌ నుంచి రోగులను మంగళగిరికి చేర్చేందుకు ఉచిత వాహన సౌకర్యం కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

కార్యక్రమంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ త్రిపాఠి, ఎయిమ్స్‌ డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ వంశీకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి నవీన్‌కుమార్, కమిషనర్‌ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్‌ పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: స్మార్ట్‌ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top