breaking news
All India Institute of Medical Science
-
పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇకపై ఎయిమ్స్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలందనున్నాయి. ఈ మేరకు గురువారం మంగళగిరిలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఎయిమ్స్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే సీఎం జగన్ ఆలోచనల మేరకు ఎయిమ్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 100 మందికి పైగా రోగులకు ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించామన్నారు. 30 మందికి పైగా రోగులకు చికిత్సలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ట్రయల్ రన్ పూర్తవ్వడంతో అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. 24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలందేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యం అతి త్వరలో ఎయిమ్స్‌లో పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి రానుందని మంత్రి విడదల రజిని చెప్పారు. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ అవశేషాలున్నా సరే.. ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఏపీలోనే అందించాలనే సీఎం జగన్ ఆలోచనకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌కు ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు. వచ్చే జూన్ కల్లా పైపులైను పనులు పూర్తవుతాయని చెప్పారు. ఎయిమ్స్ నుంచి రోగులను మంగళగిరికి చేర్చేందుకు ఉచిత వాహన సౌకర్యం కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి, ఎయిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ వంశీకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి నవీన్‌కుమార్, కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?) -
‘ఎయిమ్స్’స్థలాలు రెడీ
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) ఏర్పాటుకు స్థలాలు రెడీ అయ్యాయి. కాంచీపురం, పుదుకోట్టై, తంజావూరు, ఈరోడ్, మదురైలలో స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ వివరాల్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తూ సీఎం జయలలిత ఆదివారం లేఖాస్త్రం సంధించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) విజ్ఞాన శాస్త్ర పరంగా అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైద్య విద్యా వ్యాప్తి, బలోపేతం, పరిశోధనల లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నా ఈ ఇన్స్టిట్యూట్ తరహా సేవలు అన్ని ప్రధాన రాష్ట్రాలకు విస్తరింప చేయడం లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది. పీఎం మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మరునాడే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తమిళనాడుతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు తగ్గ అనుకూల పరిస్థితులపై ఆరా తీసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. దశల వారీగా ఈ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. దీంతో రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా ఇన్స్టిట్యూట్ నెలకొల్పేందుకు కేంద్రం సిద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ పనుల్ని వేగవంతం చేసింది.స్థలాలు రెడీ : ఎయిమ్స్ ఏర్పాటుకు తమిళనాడులో అనువైన పరిస్థితులు. స్థలాల ఎంపిక మీద దృష్టి పెట్టిన కేంద్రం అందుకు తగ్గ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసింది. దీంతో రాష్ట్రానికి అత్యున్నత హోదా కలిగిన ఇన్స్టిట్యూట్ రానుండడంతో స్థలాల ఎంపిక మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పది చోట్ల స్థలాన్ని పరిశీలించింది. రోడ్డు రవాణా, విమానాశ్రయం, గాలి, నీరు, తదితర అనువైన ప్రదేశాల్ని గుర్తించి చివరకు ఐదు స్థలాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. స్థలాలు రెడీ కావడంతో ఇక, తమ రాష్ట్రంలో ఎయిమ్స్ పనులకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే శ్రీకారం చుట్టాలన్న విజ్ఞప్తితో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించే పనిలో సీఎం జయలలిత పడ్డారు. పీఎంకు సీఎం లేఖాస్త్రం : ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో సీఎం జయలలిత హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఎయిమ్స్ ఏర్పాటుకు నిర్ణయించడం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులతో అందుకు తగ్గ పనులను తాము పూర్తి చేశామని వివరించారు. రాష్ట్రంలో కాంచీపురం జిల్లా చెంగల్పట్టు, పుదుకోట్టై జిల్లా పుదుకోట్టై నగరం, తంజావూరు జిల్లా చెంగి పట్టి, ఈరోడ్ జిల్లా పెరుంతురై, మదురై జిల్లా తోప్పుర్లు ఎయిమ్స్ ఏర్పాటుకు గాను అనువైన ప్రదేశాలుగా సూచించారు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు సమృద్ధిగా ఉన్నాయని, ఈ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు మార్గం, రైల్వే మార్గంతోపాటుగా విమానాశ్రయాలు సైతం ఉన్నట్టు వివరించారు. తాగు నీరు, ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనంతో కూడుకున్న ప్రదేశాలతో నిండిన ఈ స్థలాలు ఎయిమ్స్‌కు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఏదేని ఓ చోట ఎయిమ్స్‌ను నెలకొల్పిన పక్షంలో అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో దోహదకారిగా ఉంటుందని సూచించారు. అత్యున్నత వైద్య విద్యను గ్రామీణ, పేద, మధ్య తరగతి వర్గాలకు మరింత దగ్గరకు చేర్చినట్టు అవుతుందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం పనులకు శ్రీకారం చుట్టే విధంగా ఆరోగ్య శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.డెయిరీలు : అంతకు ముందుగా సచివాలయంలో సీఎం జయలలిత పాల డెయిరీలను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా డెయిరీల్లో పాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఇందులో పుదుకోట్టైలో రూ.2.91 కోట్లతో రోజుకు 35 వేల లీటర్ల పాల ఉత్పత్తి, నిల్వ ఉంచే విధంగా అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అలాగే, తిరువళ్లూరు జిల్లా కాకలూరులో కోట్లాది రూపాయలతో పునరుద్ధరించిన డెయిరీ, ఈరోడ్‌లో సహకార సంస్థకు చెందిన రూ.మూడు కోట్లతో నిర్మించిన గిడ్డంగులు ఉన్నాయి.