ఖరీఫ్ కొనుగోళ్ల జాబితాలో చోటు దక్కని ఆంధ్రప్రదేశ్
పక్క రాష్ట్రాలకు మాత్రం రూ.వేల కోట్ల కేంద్ర నిధులు
అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.3,992.57 కోట్లు
కర్ణాటకకు రూ.1,107 కోట్లు.. తెలంగాణకు రూ.448.42 కోట్ల కేటాయింపు
కరువు కాలంలోనూ రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం రాష్ట్ర రైతులకు శాపంగా తయారైంది. మార్కెట్‌లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తుల సేకరణకు ఆర్థిక చేయూత కోసం పంపే ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తుంది. కానీ రెండున్నరేళ్లుగా ఏపీ విషయంలో మాత్రం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నా.. చంద్రబాబు సర్కారు నోరు మెదపడం లేదు. ఓ వైపు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో లక్షలాది ఎకరాలు సాగుకు దూరమయ్యాయి. సాగైన ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఎంత మేర దిగుబడులు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సంక్షోభ సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోంది.
పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026–27లో పంటల కొనుగోళ్ల కోసం ఏపీ పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు కేంద్రం మొండిచేయి చూపింది. ఈ సీజన్‌లో కనీస మద్దతు ధరకు పప్పు ధాన్యాలు, నూనెగింజలను కొనుగోలుకు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం భారీగా ఆర్థిక చేయూత ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా రూ.5,547.99 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. కానీ ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం కనిపించకపోవడం గమనార్హం.
పొరుగున్న కర్ణాటక, తెలంగాణకు ఆర్థిక చేయూత...
రాష్ట్రాల వారీగా కేటాయించిన కొనుగోళ్ల విలువను పరిశీలిస్తే కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 4.66 లక్షల టన్నుల కందులు సేకరణకు రూ.3,937.70 కోట్లు, 6,250 టన్నుల పెసలు కొనుగోళ్లకు రూ.54.87 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కర్ణాటకకు 1.16 లక్షల టన్నుల సోయాబీన్ సేకరణకు రూ.659.27 కోట్లు, 38 వేల టన్నుల పెసలు సేకరణకు రూ.335.83 కోట్లు, 13 వేల టన్నుల పొద్దుతిరుగుడు సేకరణకు రూ.111.90 కోట్లు ఇలా ఈ రాష్ట్రంలో 1.67 లక్షల టన్నుల పంట ఉత్పత్తుల సేకరణకు రూ.1,107 కోట్లు ఖర్చు చేస్తోంది.
తెలంగాణలో 62 వేల టన్నుల సోయాబీన్ సేకరణకు రూ.353.90 కోట్లు, 11 వేల టన్నుల పెసల సేకరణకు రూ.94.52 కోట్లు కలిపి 73 వేల టన్నులు పంట ఉత్పత్తుల సేకరణకు రూ.448.42 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మరి ఇదే సమయంలో దేశంలోనే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న ఏపీలో రైతులకు పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఆర్ధిక చేయూత ప్రకటించకపోవడమే ఆందోళనకు గురిచేస్తుంది.
రెండేళ్లుగా ఏ పంటకు దక్కని మద్దతు ధర..
గడిచిన రెండున్నరేళ్ల గా రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. ప్రభుత్వ ఏజెన్సీలను రంగంలోకి దింపి రైతుల నుంచి వారు పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరలు కొనుగోలు చేసిన దాఖలాలూ లేవు. కనీసం కేంద్రానికి సకాలంలో ప్రతిపాదనలు పంపడం, ఆ మేరకు నిధులను రాబట్టి ధరలు పతనమైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి ఉపశమన చర్యలు చేపట్టకపోవడంతో రెండున్నరేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రస్తుత సీజన్‌లో కందులు, పెసలు వంటి పప్పు ధాన్యాలతో పాటు మొక్కజొన్న పంటలే ఈ కాస్త సాగయ్యాయి. కనీసం వాటికైనా మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ లేదు. కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరికి అద్దం పడుతుంది. ఈ సీజన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో ప్రతిపాదనలు పంపకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.
ఏపీ రైతుల గోడు పట్టదా?
ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం, సాగునీటి కొరత, పెరిగిన పెట్టుబడుల ఖర్చులు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగు, ఎదుగుదల, దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడింది. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులకు పంట చేతికొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లభించక పోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటల కొనుగోళ్లకు కేంద్రం మద్దతు ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగకపోతే అయినకాడకి అమ్ముకొని మరింత నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అవసరమైన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, కోతలకు ముందుగానే పంట కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


