రాష్ట్రమంతా ఒకేలా కొనుగోలు చేయాలి

Andhra Pradesh ministers On Aqua Empowerment Committee meeting - Sakshi

రొయ్యలు 100 కౌంట్‌ రూ.210 తగ్గకుండా కొనాల్సిందే 

ఇకనుంచి శాస్త్రీయంగా ధరల నిర్ధారణ జరగాలి 

ఎగుమతుల ప్రతికూలతపై దృష్టి సారించాలి 

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లపై నిరంతర పర్యవేక్షణ 

రైతులు నష్టపోకుండా సమన్వయంతో ముందుకెళ్లాలి 

ఆక్వా సాధికారత కమిటీ భేటీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సీదిరి

సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రాష్ట్రమంతా ఒకేరీతిలో రొయ్యల కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. 100 కౌంట్‌ రొయ్యల ధర రూ.210కి  తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ధర కంటే తక్కువగా కొనుగోలు చేసే ప్రాసెసింగ్‌ కంపెనీలను ఉపేక్షించబోమన్నారు. ఆక్వా సాధికారత కమిటీ సమావేశం బుధవారం మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును అధికారులు మంత్రులకు వివరించారు.

ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం మాట్లాడుతూ 100 కౌంట్‌ రూ.210 చొప్పున కొనుగోలు చేయాలన్న గత కమిటీ భేటీలో నిర్ణయాన్ని మెజార్టీ ప్రాసెసింగ్‌ కంపెనీలు పాటిస్తున్నాయని, కొన్ని కంపెనీలు మాత్రం నేటికీ రూ.190 నుంచి రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. అటువంటి కంపెనీలు, వ్యాపారులతో నిత్యం సంప్రదిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, కమిషనర్‌ కన్నబాబు మాట్లాడుతూ సాధికారత కమిటీ సమావేశాల్లో మంత్రులు ఇచ్చిన ఆదేశాల మేరకు సీడ్, ఫీడ్‌ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు ధరలపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ రూపొందించినట్లు చెప్పారు. సీడ్, ఫీడ్‌ రేట్లను ఎప్పటికప్పుడు డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లో ఉంచుతున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ధరలను కూడా పోర్టల్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఆక్వారంగానికి ప్రభుత్వం చేయూత
మంత్రులు మాట్లాడుతూ ఆక్వా రంగానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. ఆక్వా రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, సీడ్, ఫీడ్‌ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగితేనే ఆక్వారంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఆక్వారంగం సమస్యల పరిష్కారం కోసమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సాధికారత కమిటీ ఏర్పాటైందని చెప్పారు. ధరల విషయంలో నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని, సమస్య ఏర్పడిన వెంటనే స్పందించాలని ఆదేశించారు.

రొయ్యల ధరల స్థిరీకరణ, సీడ్, ఫీడ్‌ రేట్లు, నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రం మనదేనని చెప్పారు. అత్యధికంగా ఆక్వా ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా మన రాష్ట్రంలో ఆక్వారేట్లు కొన్నిసార్లు తగ్గిపోతున్నాయని, స్టోరేజీ అవకాశాలను పరిశీలించి అటువంటి సమయాల్లో ధరలను స్థిరీకరించేందుకు పరిశీలించాలని వారు సూచించారు. ఈ సమావేశంలో పర్యావరణం, అటవీ సైన్స్, సాంకేతిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top