మా తరానికి విద్యా ప్రదాత సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

మా తరానికి విద్యా ప్రదాత సీఎం జగన్‌

Published Mon, Oct 9 2023 5:43 AM

Andhra Pradesh: Major changes in education system with the efforts of CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మా మాటలను ప్రపంచమంతా ఆసక్తిగా ఆలకించిందంటే మన విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల పుణ్యమే! చెట్ల కింద సాగే వానాకాలం చదువులను సంస్కరణల బాట పట్టించిన సీఎం జగన్‌ సర్‌దే ఆ గొప్పతనమంతా! చదువులతోటే పేదరికాన్ని ఎదిరిద్దామన్న ఆయన పిలుపు అక్షర సత్యం! విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చో దేశానికే మార్గ నిర్దేశం చేశారు. ప్రతిభతో రాణిస్తున్న పేదింటి బిడ్డలకు దక్కిన అరుదైన గౌరవమిది.

ఐరాస, వరల్డ్‌ బ్యాంక్‌ వేదికగా అంతర్జాతీయ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించడం.. ఎన్నడూ రాష్ట్రం దాటని మేం ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కాలు మోపడం.. కాణీ ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్లి రావడం.. ఇదంతా ఇంకా నమ్మశక్యంగా లేదు!.. ఇదీ నిరుపేద కుటుంబాల్లో జన్మించి అంతర్జాతీయ వేదికలపై అందరినీ ఆకట్టుకున్న 10 మంది విద్యార్థుల మనోగతం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 45 లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీరంతా సెప్టెంబర్‌ 15 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించి వివిధ వేదికలపై తమ గళాన్ని సగర్వంగా వినిపించారు.  

ప్రభుత్వ బడి నుంచి ఐఎంఎఫ్‌కు..  
ఎకరం పొలంతో పాటు కేబుల్‌ ఆపరేటింగ్‌ పనులు చేసుకునే రైతు బిడ్డనైన నాకు 190 దేశాలకు సభ్యత్వమున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో మాట్లాడే అవకాశం దక్కడం నిజంగా అదృష్టమే. అది సీఎం జగన్‌ సర్‌ తెచ్చిన విద్యా సంస్కరణల ఫలితమే. మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానాన్ని అగ్రరాజ్యం ప్రతినిధులకు వివరించడం చాలా సంతోషంగా ఉంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, షూలు, నాణ్యమైన పోషకాహారం, ట్యాబ్‌లు, కార్పొరేట్‌ స్థాయిలో పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని తెలియచేశా.

ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుబ్రమణ్యన్‌ మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరువకూడదని, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ఖండాతరాలకు విస్తరింపజేయాలని నిర్ణయించుకున్నా. పేద పిల్లలకు జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకునే బాధ్యత విద్యార్థులపైనే ఉంది.       – వంజివాకం యోగీశ్వర్,  ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరసింగాపురం, తిరుపతి జిల్లా 

ఎన్నడూ చూడని సదుపాయాలు.. 
మా బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాం. గతంలో ఎన్నడూ చూడని సదుపాయాలను సీఎం జగన్‌ ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యావ్యవస్థలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.      
– నాగరాజు, విజయ (యోగీశ్వర్‌ తల్లిదండ్రులు, అక్క)  

 నిజంగా.. నేనేనా! 
ఐరాస, వరల్డ్‌ బ్యాంకుల్లో ప్రసంగించింది నేనేనా అని ఆశ్చర్యంగా ఉంది. అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించడాన్ని కూడా నమ్మలేకున్నా. సోషల్‌ పుస్తకంలో ఫొటో మాత్రమే చూసిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఒక రోజంతా ఉన్నాం. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్‌ కార్యక్రమంలో పాల్గొని ఇతర దేశాల విద్యార్థులతో ముచ్చటించి వారి సంస్కృతిని తెలుసుకున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పథకాలను వివరించాం. ప్రభుత్వ పాఠశాలల్లో  మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద తదితర పథకాల అమలు తీరుతోపాటు బడుల్లో తాగునీరు, టాయిలెట్స్, కాంపౌండ్‌ వాల్స్, ల్యాబ్స్‌తో పాటు జగనన్న కానుక కింద స్కూల్‌ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, షూలు ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇవ్వడంపై వరల్డ్‌ బ్యాంక్, యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ అధికారులతో మాట్లాడాం. నయాగరా వాటర్‌ ఫాల్స్‌ చూశాం. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ, 2001లో కూలిపోయిన ట్విన్‌ టవర్స్‌ చరిత్ర  తెలుసుకున్నా.  
– అల్లం రిషితారెడ్డి,    కస్పా మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, విజయనగరం     

ఇంత గుర్తింపు ప్రభుత్వ చలవే.. 
గతంలో మా ఇద్దరు అమ్మాయిలను ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించాం. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాం. ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు వచ్చాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోనే చదివించి ఉంటే ఇంత గుర్తింపు లభించేది కాదు.  
    – ఉదయలక్ష్మి, రామకృష్ణారెడ్డి (రిషితారెడ్డి తల్లిదండ్రులు)  

విద్యా సంస్కరణల అమలుతో.. 
మా అమ్మ ఫాతిమా వ్యవసాయ కూలీ. మాలాంటి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసగించే అవకాశాన్ని సీఎం జగన్‌ సర్‌ కల్పించారు. అమెరికాలో 15 రోజుల పర్యటనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. విద్యాపరంగా ఎలాంటి సంస్కరణలు అమలుపరిస్తే దేశం అభివృద్ధి చెందుతుందో ఇంటర్నేషనల్‌ యూత్‌ కాన్ఫరె­న్స్‌లో విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాడు–నేడు, విద్యాకానుక, డిజిటల్‌ బోధన, గోరుముద్ద, అమ్మఒడి లాంటి పథకాలను మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా స్వేచ్ఛ పథకాన్ని అమలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది.  
– షేక్‌ అమ్మాజాన్, ఏపీ ఆర్‌ఎస్, వేంపల్లి, శ్రీసత్యసాయి జిల్లా 

పేద కుటుంబాలకు విద్యా ప్రదాత 
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న సీఎం జగన్‌ మా తరంలో పేద కుటుంబాలకు విద్యా ప్రదాతగా నిలిచిపోతారు. మన రాష్ట్రంలో తెచ్చిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఐరాస వేదికగా వీటిని చాటిచెప్పాం. ఈ పర్యటనను కలలో కూడా ఊహించలేదు. మాలాంటి పేద విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం ప్రోత్సహించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం వల్లే ఈ అవకాశం లభించింది. రెండు వారాల పాటు ఎందరో ప్రముఖులతో చర్చించడం గర్వంగా ఉంది.    
– మోతుకూరి చంద్రలేఖ, కేజీబీవీ, ఎటపాక, ఏఎస్‌ఆర్‌ జిల్లా  

ధీమాగా చదువులు.. 
కేజీబీవీలో చదువుకున్న నా బిడ్డకు ఈ అవకాశాన్ని కల్పిం చిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలాంటి తండ్రులకు పిల్లల చదువులపై బెంగ పోయింది. డబ్బున్న వారు, ఉద్యోగాలు చేసేవారు కూడా ఇప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపడం విద్యా సంస్కరణల పుణ్యమే.   
 – రామారావు, ఆటో డ్రైవర్‌ (చంద్రలేఖ తండ్రి)   

ప్రపంచానికి చాటి చెప్పా.. 
మా నాన్న దస్తగిరి లారీ డ్రైవర్‌. అమ్మ రామలక్ష్మి రజక వృత్తిలో ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించే అవకాశాన్ని సీఎం జగన్‌ కల్పిం చారు. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. న్యూయార్క్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రపంచానికి తెలియచేశా. నాడు–  నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించా.

ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయి. టాయిలెట్ల శుభ్రతతో పాటు బాలికలకు ప్రత్యేకంగా న్యాప్‌కిన్ల వాడకంపై అవగాహన కల్పించడం, అమ్మఒడి పథకంతో స్కూళ్లలో డ్రాప్‌అవుట్స్‌ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ అంశాలను ఐరాస ప్రతినిధులకు వివరించా. మన దేశ ఆర్థి క వ్యవస్థలో యువత భాగస్వామ్యంపై ప్రసంగించా. ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌లో చాలా మంది స్టార్టప్‌లు ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పా.   
– చాకలి రాజేశ్వరి, ఏపీ మోడల్‌ స్కూల్, నంద్యాల 


పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే మాకు.. 
కాకినాడ జిల్లా తీరప్రాంత గ్రామమైన రమణక్కపేటలో నిరుపేద ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డు కుటుంబంలో జన్మించిన నాకు అంతర్జాతీయ వేదికపై ప్రసంగించేలా సీఎం జగన్‌ సార్‌ గొప్ప అవకాశాన్ని కల్పించారు. నాన్న సింహాచలం సెక్యూరిటీ గార్డు కాగా అమ్మ శాంతి గృహిణి. నేను, చెల్లి, తమ్ముడు.. ఇదీ మా కుటుంబం. నాన్న కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే కుటుంబం నుంచి వచ్చిన నేను అమెరికా వెళ్లానంటే అది జగన్‌ సార్‌ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పుల పుణ్యమే.

విద్యతోనే అన్నీ సాధ్యమవుతాయని సీఎం సార్‌ చెబుతుంటారు. అది నిజమే. అందుకు నేనే నిదర్శనం. సాధారణ విద్యార్థులను ప్రభుత్వ ప్రతినిధులుగా అమెరికా పంపించి సీఎం జగన్‌ సర్‌ చరిత్ర సృష్టించారు. భవిష్యత్‌లో ఐఏఎస్‌ అయ్యి సీఎం జగన్‌ సార్‌ ఆశయ సాధనకు కృషిచేస్తా. రాష్ట్రంలోని విద్యా సంస్కరణలు విదేశాల్లో సైతం గుర్తింపు పొందాయి. కొలంబియా యూనివర్సిటీలో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గౌరవప్రదమైన జీవనోపాధులపై వివరించడం  ఆనందంగా ఉంది.  
– దడాల జ్యోత్స్న, సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాల,వెంకటాపురం, కాకినాడ జిల్లా 

మరపురాని అనుభూతి..  
ఐరాస, కొలంబియా యూనివర్సిటీల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నా. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలపై మాట్లాడటం మరపురాని అనుభూతి. మా జీవితాన్ని మలుచుకునేందుకు ఈ పర్యటన ఎంతో స్ఫూర్తినిచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేం.  విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. 
– పసుపులేటి గాయత్రి, జడ్పీహెచ్‌ఎస్, వట్లూరు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా  

ఎంతో నేర్చుకున్నాం.. 
నాకు ఇంత అరుదైన అవకాశం జగన్‌ మామయ్య పాలనలో దక్కడం, అందుకు ప్రభుత్వ పాఠశాలలు వేదిక కావడం ఎన్నటికీ మర్చిపోలేను. సెప్టెంబర్‌ 15 నుంచి 27 వరకు జరిగిన విదేశీ విజ్ఞాన యాత్రలో ఐరాస జనరల్‌ అసెంబ్లీ హాల్‌ని సందర్శించాం. కొలంబియా యూనివర్సిటీలో ఎకో ఎంబాసిడర్‌ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ, ట్విన్‌ టవర్స్‌ కూలిన చోటు, నయాగరా జలపాతం ఇలా వివిధ ప్రాంతాలను  సందర్శించి అక్కడి సంస్కృతిపై అవగాహన పెంచుకున్నాం. విదేశీ విద్యార్థులతో ముచ్చటించడం కొత్త అనుభూతిని కలిగించింది.

ప్రపంచ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో ఆర్థి క విషయాలు, అంతర్జాతీయ ఆర్థి క అవసరాలు, ఆర్థిక పరిపుష్టికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తదితర అంశాలను నేర్చుకున్నాం. అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్‌ హౌస్‌ను సందర్శించే అవకాశం రావడం మరపురాని అనుభూతి.  రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో 12 శాతం విద్యపై ఖర్చు చేయటాన్ని బట్టి చదువులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.  
– జి.గణేష్‌ అంజన సాయి, వల్లూరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా 

గిరిజన బిడ్డకు గర్వకారణం.. 
మాది కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామం. కుటుంబ కారణాలతో తల్లిదండ్రులు విడిపోయారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ఏసీ బస్సు అంటే ఏమిటో కూడా తెలియదు. గతంలో ఓసారి విశాఖపట్నం, మరోసారి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ కోసం విజయవాడ వెళ్లా. అలాంటిది మన రాష్ట్ర ప్రతినిధిగా విమానం ఎక్కి ఏకంగా అమెరికా వెళ్లి రావడం కలగానే ఉంది.

మన విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలను ఐరాస, యూఎస్‌ స్టేట్‌ అధికారులకు వివరించా. ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ విద్యా విధానంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను కొలంబియా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో తెలియచేశా. వివిధ దేశాల విద్యార్థులతో మాట్లాడి భిన్న సంస్కృతులను తెలుసుకునే అవకాశాన్ని కల్పిం చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు.    
– సామల మనస్విని, కేజీబీవీ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, మన్యం జిల్లా 

ప్రభుత్వ స్కూళ్ల విశిష్టతను చాటిచెప్పాం.. 
    నాన్న సోమనాథ్, అమ్మ గంగమ్మ వ్యవసాయ కూలీలు. పేద కుటుంబాల నుంచి వచ్చిన మేం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిం చిన సదుపాయాలు, విశిష్టతను ప్రపంచానికి తెలియచేశాం. విద్యారంగంలో మన రాష్ట్రం ఏ స్థాయిలో రాణిస్తోందో చాటాం. ఈ పర్యటనలో చాలా విషయాలు నేర్చుకున్నా. యూఎన్‌వో హెడ్‌ క్వార్టర్స్, ఐఎంఎఫ్‌ సమావేశంలో ప్రసంగించడం మరచిపోలేని అనుభూతి.

స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ, నయగారా ఫాల్స్, మ్యూజియం, వైట్‌హౌస్‌ లాంటి ప్రదేశాలను సందర్శించడం మాలాంటి వారికి అసాధ్యం. సీఎం జగన్‌ సర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు. ప్రతిభ చాటిన మాకు మరువలేని అవకాశాన్ని కల్పిం చారు. చదువుల్లో రాణించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ సదస్సులకు ఎంపిక చేయడం దేశంలో ఇదే ప్రథమం.    
– మాల శివలింగమ్మ, కేజీబీవీ, ఆదోని, కర్నూలు జిల్లా 

 

Advertisement
Advertisement