కేసుతో సంబంధం లేని వ్యక్తి పిటిషన్‌ ఎలా వేస్తారు?  | Andhra Pradesh High Court Comments On Janasena Party | Sakshi
Sakshi News home page

కేసుతో సంబంధం లేని వ్యక్తి పిటిషన్‌ ఎలా వేస్తారు? 

Oct 19 2022 3:52 AM | Updated on Oct 19 2022 3:52 AM

Andhra Pradesh High Court Comments On Janasena Party - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులపై దాడి చేసినందుకు విమానాశ్రయ పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని కోరుతూ కేసుతో సంబంధం లేని మూడో వ్యక్తి ఎలా పిటిషన్‌ వేస్తారని హైకోర్టు సందేహం వ్యక్తంచేసింది. ఈ వ్యాజ్యాలను అనుమతిస్తే ఇటువంటివి పెద్ద సంఖ్యలో దాఖలయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. కేసులు ఎదుర్కొంటున్న వారు మాత్రమే ఇలాంటి పిటిషన్‌ దాఖలుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది.

విచారణార్హతపై స్పష్టత వచ్చిన తరువాతే మధ్యంతర ఉత్తర్వుల జారీని పరిశీలిస్తామంది. అప్పటివరకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విశాఖపట్నంలో జనవాణి నిర్వహణకు పోలీసులకు దరఖాస్తు చేసుకోవచ్చని, అనుమతిని నిరాకరిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టంచేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జనసేన కార్యకర్తల అరెస్టు, విశాఖ నగరం, ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో పార్టీ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టకుండా విశాఖ ఏసీపీ జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రులపై దాడి జరిగిన సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు తన విధులకు ఆటంకం కలిగించారంటూ పెందుర్తి సీఐ నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసును కూడా కొట్టేయాలని ఆయన మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ రెండు వ్యాజ్యాలపై జస్టిస్‌ రాయ్‌ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ, జనవాణిని అడ్డుకునేందుకే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. అధికార పార్టీ మంత్రులు, నేతలే జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. థర్డ్‌ పార్టీ సైతం ఎఫ్‌ఐఆర్‌ల రద్దు కోరవచ్చునని తెలిపారు.

ప్రభుత్వ న్యాయవాది (హోం) వేలూరు మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుతో సంబంధం లేని వ్యక్తులు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. ఇందుకు సంబంధించి తీర్పులను ఆయన కోర్టు ముందుంచారు. విమానాశ్రయం లోపల జరిగే ఘటనలపై సాధారణ పోలీసులు కూడా కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement