మత విశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యం

Andhra Pradesh High Court Comments On Bakreed restrictions - Sakshi

బక్రీద్‌ సందర్భంగా ఆంక్షలు విధించడం తప్పేమీ కాదు 

ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించిన హైకోర్టు 

ఆంక్షల ఉత్తర్వులను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ కొట్టివేత 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నేపథ్యంలో బక్రీద్‌ ప్రార్థనల సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఆంక్షలు విధించడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. మత విశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని బక్రీద్‌ సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జీవో 100ను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, మసీదుల్లో పెద్ద సంఖ్యలో గుమికూడటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మసీదుల్లో 50 మందికి మించి ప్రార్థనలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాది షేక్‌ ఆరీఫ్‌ మాలిక్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్‌ బట్టు దేవానంద్‌ విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చేజర్ల సుబోద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఆంక్షల వల్ల బక్రీద్‌ ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందని, ఈద్గాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతినిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రతి మతస్తుడు వారి మతాన్ని ఆచరించుకోవచ్చునని, అయితే ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో ఈ కేసులో చూడాల్సింది ప్రజారోగ్యం, ప్రజా క్షేమం మాత్రమేనని తెలిపారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం విషయంలో కూడా ఆంక్షలు విధించారని ఆయన గుర్తు చేశారు. మత విశ్వాసాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది టీఎన్‌ఎం రంగారావు వాదనలు వినిపిస్తూ.. కరోనా కట్టడి నిమిత్తం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వం ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top