కులుమనాలిలో చిక్కుకున్న జీవీఎంసీ కార్పొరేటర్లు 

Andhra Pradesh GVMC corporators trapped in Kulumanali - Sakshi

స్టడీ టూర్‌కి 74 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు 

మండీ వద్ద కొండ చరియలు విరిగిపడటంతో నిలిచిపోయిన ట్రాఫిక్‌ 

దాదాపు 20 గంటల పాటు తిండీ నీళ్లూ కరవు 

స్పందించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం, ఆర్మీ అధికారులు 

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): అధ్యయన యాత్రకు వెళ్లిన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)కు చెందిన 74 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కులు మనాలిలో చిక్కుకు పోయారు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో దాదాపు 20 గంటలపాటు నీరు, ఆహారం లేక అవస్థలు పడ్డారు. ఆర్మీ అధికారులు శనివారం రాత్రి ట్రాఫిక్‌ క్లియర్‌చేసి వాహనాలను వదలడంతో ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ నుంచి మొత్తం 141 మంది ఈ నెల 16న అధ్యయన యాత్రకి వెళ్లారు. తొలుత ఢిల్లీ, ఆ తర్వాత సిమ్లాకు వెళ్లారు.

అక్కడి నుంచి కులు మనాలి వెళ్లారు. మనాలి కార్పొరేషన్‌ విజిట్‌ అనంతరం శుక్రవారం చండీగఢ్‌కు వెళ్లాల్సి ఉంది. వీరిలో ఏడుగురు విమానంలో చండీగఢ్‌ వెళ్లేందు కులు మనాలిలో ఉండిపోయారు. మిగతా 134 మంది 4 బస్సుల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరారు. చండీఘర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో మండీ వద్ద జోరుగా కురుస్తున్న వానకు కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కార్పొరేటర్ల బస్సులు కూడా  ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.

శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం వరకు బస్సులోనే ఉండాల్సి వచ్చింది. కనీసం తాగడానికి నీరు కూడా దొరకలేదని కొందరు కార్పొరేటర్లు చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల అనంతరం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్రం నుంచి ఆర్మీ అధికారులు వచ్చారని, కొన్ని అరటిపండ్లు, రొట్టెలు ఇవ్వడంతో కొంత ఉపశమనం కలిగిందని తెలిపారు. శనివారం రాత్రి 7 గంటల తర్వాత అధికారులు రోడ్డుపై బండ రాళ్లను, దెబ్బ తిన్న వాహనాలను తొలగించారు. దీంతో కార్పొరేటర్ల బస్సులు కూడా బయల్దేరాయి. 

అందరూ సురక్షితం : మేయర్‌ 
కార్పొరేటర్లంతా సురక్షితంగానే ఉన్నారని విశాఖ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి చెప్పారు. కార్పొరేటర్లంతా ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచి వైజాగ్‌ వస్తారని ఆమె తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top