యానాదుల బతుకుల్లో మార్పుకు శ్రీకారం

Andhra Pradesh Govt Focus On Yanadula Community Welfare - Sakshi

సంక్షేమ పథకాలను చేరువ చేసేలా ప్రభుత్వ కార్యాచరణ 

వారి స్థితిగతులు తెలుసుకునేలా ‘కోబో’ యాప్‌తో సర్వే 

విజయవాడ మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలో పైలెట్‌ ప్రాజెక్ట్‌  

ఆధార్, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్లతో పాటు చేపల వేటకు లైసెన్స్‌ల జారీ 

సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన యానాదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నెల్లూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ప్రత్యేకంగా యానాదులకు ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్‌ కార్డుల జారీతో వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే. తాజాగా విజయవాడ ఐటీడీఏ(మైదాన ప్రాంతం) పరిధిలోని ఎన్టీఆర్‌ జిల్లాలో యానాదుల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

కేర్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోబో కలెక్ట్‌ యాప్‌(మొబైల్‌ అప్లికేషన్‌) సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలతో పాటు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేసే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. 

కోబో యాప్‌తో సమగ్ర సమాచారం 
గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో కేర్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏకుల రవి, వెలుగు చంద్రరావు తమ సిబ్బందితో కలిసి కోబో కలెక్ట్‌ యాప్‌తో ఎన్టీఆర్‌ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి యానాదులను గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి స్థితిగతులు, సమస్యలను యాప్‌ ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అందిస్తున్నారు.

గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని యానాదుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో, చిన్న పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల యంత్రాంగంతో మాట్లాడి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. 412 మంది యానాదులకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ.50 వేల చొప్పున అందించారు. 2,500 మందికి ఆధార్‌ కార్డులు, 550 మందికి రేషన్‌కార్డులు, మూడు వేల మందికి కుల ధ్రువీకరణ పత్రాలిప్పించేలా చర్యలు చేపట్టారు.

చేపల వేటకు లైసెన్స్‌లిస్తున్నాం..
మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలోని ఎస్టీల్లో లంబాడీ, ఎరుకల, యానాది, చెంచు, నక్కల తెగల వారున్నారు. వారిలో యానాదులకు సరైన చిరునామా, నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వారి స్థితిగతులపై చేపట్టిన సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిస్తున్నాం.

ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవించే యానాదుల ఉపాధిని మరింత మెరుగుపరిచేలా దృష్టి సారించాం. కాలువలు, నదుల్లో చేపలను వేటాడుకునేలా జి కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 18 మందికి కొత్తగా లైసెన్స్‌­లిచ్చాం. మత్స్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సబ్సిడీపై వలలు అందించేలా కార్యాచరణ చేపట్టాం.  
– ఎం.రుక్మంగదయ్య, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్, మైదాన ప్రాంత ఐటీడీఏ(విజయవాడ) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top