
జోగుళాంబ గద్వాల్: చేపల వేటకు వెళ్లి కెనాల్‌లో పడ్డ జెయింట్ వీల్ నిర్వాహకుడిని ఎస్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, పోలీస్ బృందాలు సాహాసోపేతంగా కాపాడాయి. గూడెందొడ్డి కెనాల్‌లో చేపలు పట్టేందుకు రమేష్, తనాజీలు వెళ్లారు. తనాజీ దాదాపు 25 అడుగుల ఎత్తునుండి జారిపడగా.. వారిని కెనాల్‌లో పడ్డ వ్యక్తిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు.
కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన తనాజీ జాతర్లలో జెయింట్ వీల్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం ధరూర్ మండల పరిధిలోని పాగుంట గ్రామ జాతరలో జెయింట్ వీల్ నిర్వహించడానికి వచ్చాడు. తనాజీ ఇవాళ మధ్యాహ్నం సమయంలో తన సహచరుడు రమేష్‌తో కలిసి చేపలు పట్టేందుకు గుడెం దొడ్డి కెనాల్ వద్దకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో రమేష్ పూర్తిగా కెనాల్‌లోకి దిగగా, తనాజీ కూడా దిగేందుకు ప్రయత్నిస్తుండగా సుమారు 25 అడుగుల ఎత్తు నుండి జారి కెనాల్‌లో పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన రమేష్ తక్షణమే “100 డయల్”కి కాల్ చేసి ధరూర్ పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న వెంటనే ధరూర్ పోలీస్ సిబ్బంది రామిరెడ్డి, వినోద్ కుమార్‌లు సంఘటన స్థలానికి బయలుదేరుతూ, వివరాలను ధరూర్ ఎస్‌ఐకి తెలియజేశారు. ఎస్‌ఐ వెంటనే ఇట్టి విషయాన్ని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్‌రావు దృష్టికి తీసుకెళ్ళి, వారి అనుమతితో ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని, సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టి తనాజీని కెనాల్‌లో నుంచి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. రక్షించిన తరువాత తనాజీకి కాలు, చేయి, విరిగినట్లు గుర్తించి,108 అంబులెన్స్ ద్వారా గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందిన వెంటనే, స్పందించిన పోలీస్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బందిని కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు అభినందించారు.