
సాక్షి, గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల డ్యామ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో తమపై కారు దూసుకురావడంతో ఒక యువకుడు ప్రాణభయంతో డ్యామ్‌లోకి దూకి గల్లంతయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు యువకులు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.
వివరాల్లోకి వెళితే, మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ (21), జానకిరాములు, ఇంకా ఇద్దరు స్నేహితులు కలిసి జూరాల డ్యామ్ సందర్శనకు వచ్చారు. రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో వారు డ్యామ్ బ్రిడ్జిపై నుంచి గద్వాల వైపు వెళ్తుండగా, కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్న కారు అజాగ్రత్తగా, సెల్‌ఫోన్ చూస్తూ మోటారు సైకిళ్లను ఢీకొట్టేందుకు దూసుకొచ్చింది. తప్పించుకొనే ప్రయత్నంలో ప్రాజెక్టుపై నుంచి 53 వ గెట్ నదిలోకి పడి గల్లంతయిన యువకుడు మహేష్.. మరొక్క యువకునికి గాయాలయ్యాయి.

జానకిరాములు తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా ఇద్దరు యువకులు దూరంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గాయపడిన యువకుడిని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో డ్యామ్ పరిసరాల్లో అలజడి నెలకొంది. గల్లంతైన మహేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.